ఆ రోజే గ్రూపు-2 మెయిన్స్.. వాయిదా పడదు..

by Anil Sikha |
ఆ రోజే గ్రూపు-2 మెయిన్స్.. వాయిదా పడదు..
X

దిశ, డైనమిక్ ​బ్యూరో: ఈ నెల 23న నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూపు-2 మెయిన్ రాత పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణపై ఇవాళ సచివాలయంలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఎ.అనురాధతో కలసి ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్​ మాట్లాడుతూ 13 జిల్లా కేంద్రాల్లోని175 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 92,250 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. ముందుగా ఎ.అనురాధ గ్రూపు-2 మెయిన్ పరీక్షల ఏర్పాట్ల గురించి వివరించారు. పరీక్షల నిర్వహణపై ఒక బుక్ లెట్ ను అన్ని పరీక్షా కేంద్రాలకు పంపామని, ఆ సూచనలన్నీ లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో పరీక్షలు వాయిదా పడతాయనే దుష్ప్రచారం నమ్మవద్దని కోరారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ ఎక్కడైనా సోషల్ మీడియా లేదా ఇతర ప్రచార మాధ్యమాల్లో నకిలీ వార్తలు ప్రసారం చేస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కె.శశిధర్, ఆశాఖ కమిషనర్ కృతికా శుక్ల, సమాచారశాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్ల, ఏపీపీఎస్సీ కార్యదర్శి ఐఎన్ మూర్తి, వర్చువల్ గా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు, ఇతర అధికారులు పాల్టొన్నారు.

Next Story