- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విజయవాడ సబ్ జైలుకు వల్లభనేని వంశీ.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం టీడీపీ కార్యాలయం(Gannavaram Tdp Office)పై దాడి కేసులో కీలక ట్విస్ట్ నెలకొన్న విషయం తెలిసిందే. ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్(Complainant Satyavardhan) కేసు వాపస్ తీసుకోవడం సంచలన పరిణామంగా మారింది. అంతేకాదు ఆయన చేసిన వ్యాఖ్యలు సైతం పలు అనుమానాలకు తావిచ్చాయి. పోలీసులే తనతో బలవంతంగా ఫిర్యాదు చేయించారని కోర్టుకు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అయితే సత్యవర్ధన్ అలా చెప్పడం వెనుక నిందితుడు వల్లభనేని వంశీ హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సత్యవర్ధన్ సోదరుడు కోటి ఇచ్చిన ఫిర్యాదుతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు మరో రెండు రోజుల్లో విచారణ జరుగుతున్న నేపథ్యంలో వల్లభనేని వంశీ అనుచరులు ఫిర్యాదు దారుడు సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసినట్లు కోటి తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన సమయంలో ఆ దృశ్యాలు స్థానిక సీసీ టీవీ ఫుటేజుల్లో నమోదు అయ్యాయి. వీటి ఆధారంగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. సత్యవర్ధన్‌ను వల్లభనేని వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి కేసు వాపస్ తీసుకుంటున్నట్లు కోర్టులో చెప్పాలని, లేకపోతే చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ బెదిరింపులు వెనుక వల్లభనేని వంశీ ఉన్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు.. హైదరాబాద్ లో ఉన్న ఆయనను అరెస్ట్ చేసి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో విచారించారు. వల్లభనేని వంశీ చెప్పిన స్టేట్ మెంట్‌ను రికార్డు చేశారు. ఈ విచారణ అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు ప్రవేశ పెట్టారు. దీంతో వంశీకి ధర్మాసనం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయతో పాటు మరో ఇద్దరు నిందితులను విజయవాడ సబ్ జైలుకు తరలించారు.
అయితే కోర్టుకు సమర్పించిన వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు తెలిపారు. సత్యవర్ధన్ ను బెదిరించడంలో వల్లభనేని వంశీదే కీలక పాత్ర అని పేర్కొన్నారు. మరణ భయంతోనే వంశీ అనుచరులు చెప్పినట్లు సత్యవర్ధన్ కోర్టులో చెప్పారని వివరించారు. వంశీపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు.
మరోవైపు వంశీ అరెస్ట్‌పై ఆయన భార్య పంకజశ్రీ న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. పోలీస్ స్టేషన్‌లో తన భర్త పట్ల తప్పుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. వంశీ అరెస్ట్ సక్రమంగా జరగలేదన్నారు. వంశీ అరెస్ట్ వెనక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పారు. తనకు ప్రాణహాని ఉందనే విషయాన్ని మేజిస్ట్రేట్‌కు వంశీ తెలిపారని పంకజశ్రీ పేర్కొన్నారు.