పిఠాపురానికి తరలిన వంద పడకల ఆసుపత్రి

by Mahesh |
పిఠాపురానికి తరలిన వంద పడకల ఆసుపత్రి
X

దిశ, కాకినాడ జిల్లా ప్రతినిధి: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఏరియా ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా మారుస్తామం టూ గతంలో ప్రజాప్రతినిధులు చేసిన హామీలు, ప్రయత్నాలు గాలికి కొట్టుకుపోయాయి. ఇక్కడ నిర్మించాల్సిన వంద పడకల ఆసుపత్రి కూతవేటు లో ఉన్న పిఠాపురం పట్టణానికి తరలిపోయింది. మరి పెద్దాపురం నియోజకవర్గ నేతలు ఏం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆస్పత్రిగా ఆధునీకరిస్తూ తీర్మానం చేశారు. దానితో అక్కడ ప్రస్తుతం 30 పడకలు ఉన్న ఆసుపత్రి వందపడకలుగా మారబోతుంది.

దానికి రూ. 38.33 కోట్ల నిధులు కూడా మంజూరు చేశారు. 66 అదనపు నూతన ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ఆధునీకరణతో సుమారు 7 లక్షల మంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశాలున్నాయి. పెద్దాపురం విషయానికొస్తే పెద్దాపురం, సామర్లకోట పట్టణాలు జంట పట్టణాలుగా ఉన్నాయి. ఈ రెండు మండలాల పరిధిలో సుమారు 30 గ్రామాలు వరకు ఉన్నాయి. అంతే కాదు పెద్దాపురం పట్టణానికి సమీపంగా జగ్గంపేట, రంగంపేట, గండేపల్లి, రాజానగరం వంటివి ఉన్నాయి. ఇక్కడ వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తే చాలా మేలు జరుగుతుందనుకున్న ఈ ప్రాంతానికి పెద్ద షాకే తగిలింది.

చక్రం తిప్పిన జనసేనాని

పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించిన జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంద పడకల ఆసుపత్రి ఏర్పాటులో చక్రం తిప్పారు. పిఠాపురం అభివృద్ధికి ప్రత్యేక అధికార బృందాన్ని నియమించిన పవన్ కళ్యాణ్ వారిచ్చిన నివేదికల మేరకు రాష్ట్ర మంత్రివర్గంలో పిఠాపురానికి వంద పడకల ఆసుపత్రి మంజూరయ్యేలా ప్రతిపాదించారు.

Advertisement

Next Story

Most Viewed