చంద్రబాబు హెల్త్ రిపోర్ట్స్‌పై అనుమానాలున్నాయ్: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

by Seetharam |   ( Updated:2023-11-16 11:32:39.0  )
చంద్రబాబు హెల్త్ రిపోర్ట్స్‌పై అనుమానాలున్నాయ్: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెల్త్ రిపోర్ట్‌పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు మెడికల్ రిపోర్ట్స్ విషయంలో తమకు అనేక సందేహాలు నెలకొన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు హెల్త్ రిపోర్ట్‌పై మెడికల్ బోర్డ్‌లో చర్చ జరగాలని అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు చర్మవ్యాధులను కూడా ప్రాణాంతక వ్యాధులుగా చూపించే ప్రయత్నం చేశారని సజ్జల అన్నారు. జైల్లో ప్రాణాంతకమైన సమస్యలతో బాధపడుతున్నారని వాదనలు వినిపిస్తే హైకోర్టు మానవతా దృక్పథంతో మధ్యంతర బెయిల్ ఇచ్చిందని గుర్తు చేశారు. జైల్లో అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పిన చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత 14 గంటలకు పైగా ప్రయాణం చేశారని గుర్తు చేశారు. రాజమహేంద్రవరం నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉన్నా...వైద్యులు హైదరాబాదులోనే ఉన్నా చంద్రబాబు ఉండవల్లి వచ్చి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కంటికి శస్త్రచికిత్స చేయించుకునేందుకు బెయిల్ పొంది రాజకీయ భేటీలు నిర్వహించారు అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చుంటే తాము ఏం చేసినా అడిగేవాళ్ల కాదని చెప్పుకొచ్చారు. కంటికి శస్త్రచికిత్స చేయకపోతే కళ్లు పోతాయని...చర్మవ్యాధులకు చికిత్స చేయకపోతే గుండె ఆగిపోతుందన్నట్టు నానా యాగీ చేసి బెయిల్ తెచ్చుకున్నారంటూ ప్రభుత్వ సలహాదారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ కాకముందు తనకు వయసుతో సంబంధం లేదని.. 71ఏళ్ళ వయసులో 17 ఏళ్ల యువకుడిలా పరుగెడుతున్నట్లు పదేపదే చెప్పుకొచ్చేవారని గుర్తు చేశారు. తీరా స్కిల్ స్కాం కేసులో జైలుకెళ్లాక వయసు, వ్యాధులను ప్రస్తావిస్తూ మధ్యంతర బెయిల్ పొందారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

Advertisement

Next Story