ఏషియన్ గేమ్స్‌ విజేతలకు సీఎం జగన్ అభినందనలు: రూ.4.29 కోట్లు నగదు ప్రోత్సాహకాలు విడుదల

by Seetharam |
ఏషియన్ గేమ్స్‌ విజేతలకు సీఎం జగన్ అభినందనలు: రూ.4.29 కోట్లు నగదు ప్రోత్సాహకాలు విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏషియన్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులు కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతిలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఆర్‌కే రోజాతో కలిసి క్రీడాకరులు సీఎం జగన్‌ను కలిశారు. ఈసందర్భంగా అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ క్రీడాకారులకు తెలిపారు. ఇటీవల చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన 19 వ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతిలు తాము సాధించిన పతకాలను సీఎం వైఎస్‌ జగన్‌కు చూపించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్‌ పాలసీ ప్రకారం క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది.8 మంది క్రీడాకారులకు నగదు బహుమతి విడుదల చేసింది.

నగదు బహుమతి ప్రకటన

1.మైనేని సాకేత్‌ సాయి, విశాఖపట్నం, టెన్నిస్, ఏషియన్‌ గేమ్స్‌ సిల్వర్‌ మెడల్‌ విజేత- రూ. 20 లక్షలు.

2. వెన్నం జ్యోతి సురేఖ, ఎన్టీఆర్‌ జిల్లా, ఆర్చరీ, ఏషియన్‌ గేమ్స్‌లో 3 గోల్డ్‌ మెడల్స్‌ విజేత- రూ. 90 లక్షలు.

3. కిడాంబి శ్రీకాంత్, గుంటూరు, బాడ్మింటన్, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేత- రూ. 20 లక్షలు.

4. ఆర్‌. సాత్విక్‌ సాయిరాజ్, రాజమహేంద్రవరం, బాడ్మింటన్, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్, గోల్డ్‌ మెడల్‌ విజేత- రూ. 50 లక్షలు.

5. యర్రాజీ జ్యోతి, విశాఖపట్నం, అథ్లెటిక్స్, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేత- రూ. 20 లక్షలు.

6. బొమ్మదేవర ధీరజ్, ఆర్చరీ, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేత- రూ. 20 లక్షలు.

7. కోనేరు హంపి, ఎన్టీఆర్‌ జిల్లా, చెస్, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేత- రూ. 20 లక్షలు.

8. బి.అనూష, అనంతపూర్, క్రికెట్, ఏషియన్‌ గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌ విజేత- రూ. 30 లక్షలు.

క్రీడాకారులకు నగదు పురస్కారంతోపాటు గతంలో పతకాలు సాధించినందుకు ఇచ్చే ప్రోత్సాహక బకాయిలు మొత్తం కలిపి రూ. 4. 29 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో ఏపీ క్రీడాకారులు మొత్తం 11 పతకాలు (5 గోల్డ్, 6 సిల్వర్‌) సాధించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి ఆర్‌కే రోజా, శాప్‌ ఎండీ హెచ్‌.ఎం.ధ్యానచంద్ర, శాప్‌ అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed