ఎన్నికల వేళ CM జగన్ సొంత జిల్లాలో విభేదాలు.. వారికి సానుకూలంగా మారనుందా?

by Disha Web Desk 9 |
ఎన్నికల వేళ CM జగన్ సొంత జిల్లాలో విభేదాలు.. వారికి సానుకూలంగా మారనుందా?
X

దిశ ప్రతినిధి, కడప: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో నెలకొన్న విభేదాల కుంపట్లో వైసీపీకి ఉక్కపోతగా మారాయి. పార్టీ అధిష్టానం నేతలతో పాటు జిల్లా రాజకీయాలు నడిపే కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పినా కొన్ని చోట్ల వర్గ పోరు కొనసాగుతూనే ఉంది. ఎస్సీ రిజర్వ్‌డు నియోజకవర్గమైన బద్వేలులో ఆ పార్టీ ముఖ్య నాయకులుగా ఉన్న నేతలు, భావ,బామ్మర్దిల మధ్య వైసీపీ రాజకీయాలు నలుగుతున్నాయి. ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడే కొద్ది ఆ పార్టీలో నెలకొన్న వర్గ పోరు పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. జిల్లా నేతలకు బద్వేలు నియోజకవర్గంలో నెలకొన్న బావ, బామ్మర్దుల అసఖ్యత తలనొప్పిగా మారింది. గత కొంతకాలంగా ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి ఆయన బావమరిది ప్రస్తుత బద్వేల్ నియోజకవర్గ అదనపు సమన్వయ కర్త విశ్వనాథరెడ్డి మధ్య వర్గ పోరు కొనసాగుతూ వస్తోంది.

ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నెల రోజుల క్రితం విశ్వనాథరెడ్డిని అధిష్టానం పిలిచి ఆయనకు అదనపు సమన్వయకర్తగా పదవి ఇవ్వడంతో పాటు సర్దుకోవాలని చెప్పారు. ఆ మేరకు గోవింద్ రెడ్డి, విశ్వనాథరెడ్డిల మద్య వర్గపోరు చల్లారుతుందని అంతా భావించారు. అయితే అలాంటి పరిస్థితి నెలకొనక పోగా పార్టీలో ఇద్దరి మధ్య రోజు రోజుకు విభేదాలు సెగలు గక్కుతున్నాయి. దీంతో నియోజకవర్గంలో అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. వీరిద్దరి వ్యవహారం మధ్య ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధాకర్ ఇబ్బందులను ఎదుర్కోవలసిన దుస్థితి ఏర్పడింది .

కుదరని సఖ్యత..

రిజర్వుడు నియోజకవర్గమైన బద్వేల్‌లో ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి, ఆయన బామ్మర్ది విశ్వనాథరెడ్డి లు ఎవరికి వారే అన్న చందంగా ఉంటున్నారు. విశ్వనాథరెడ్డి చేపట్టే కార్యక్రమాలకు కానీ, ఆయన పాల్గొనే కార్యక్రమానికి గాని గోవింద్ రెడ్డి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. కొద్దిరోజులు క్రితమే బద్వేల్ లో డాక్టర్ సుధా నామినేషన్ కు విశ్వనాధ రెడ్డి హాజరు కావడంతో గోవింద్ రెడ్డి వెళ్లిపోయారు. రెండు గంటలపాటు ఆయనతో ఎంపీ అవినాష్ రెడ్డి ఇతర నేతలు మంతనాలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటిదాకా ఎమ్మెల్యే అభ్యర్థి రోడ్డుపైనే వారికోసం ఎదురు చూడాల్సిన దుస్థితి తప్పలేదు . ఆ రోజు ముఖ్య నేతలు సర్ది చెప్పిన వారి తీరులో మార్పు రాలేదు. మళ్లీ అదే విధంగా వ్యవహరిస్తున్నారు.

వర్గపోరు కూటమికి సానుకూలం కానుందా..

తాజాగా పోరుమామిళ్ళలో ఐదు రోజుల కిందట ఎంపీ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ తో కలిసి బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డిలో ర్యాలీ నిర్వహించే విధంగా అధికారులతో అనుమతి తెచ్చుకున్నారు. కానీ ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి ఆ ర్యాలీకి మీరు హాజరైతే తన పదవికి రాజీనామా చేసి హైదరాబాద్ వెళ్ళిపోతానని ఎంపీ అవినాష్ రెడ్డి పై ఒత్తిడి తెచ్చి విశ్వనాథరెడ్డి వర్గాన్ని పక్కన పెట్టించే విధంగా ప్రయత్నం చేశారు. అవినాష్ రెడ్డి సర్ధి చెప్పి ర్యాలీ కొనసాగించాలని, విశ్వనాథ రెడ్డి మధ్యలో వస్తారని సూచించారు.

ఈ పరిస్థితుల్లో మమ‌ అనే విధంగా ర్యాలీ నిర్వహించారు. దీంతో భారీగా ర్యాలీ తలపెట్టాలని ఏర్పాటు చేసుకున్న విశ్వానాధ రెడ్డి వర్గీయులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇలా రోజు రోజుకు ఆ ఇద్దరి మధ్య వర్గ పోరు ముదిరిపాకన పడుతుండడంతో పార్లమెంట్ అభ్యర్థి అవినాష్ రెడ్డి గాని, జిల్లాలో ఇతర నాయకులు కానీ తల పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఇలా కొనసాగితే ఎన్నికలు ఎదుర్కోవడం కూడా కష్టంగా మారుతుందన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీలో నెలకొన్న వర్గ పోరు కూటమికి సానుకూలంగా మారుతుందన్న ఆందోళన వైసీపీలో వ్యక్తం అవుతుంది.

Read More..

Ap News: పట్టాపై జగన్ ఫోటో.. పెడితే తప్పు ఏంటి...!

Next Story

Most Viewed