ఫైబర్ గ్రిడ్ స్కాంలోనూ Chandrababu Naidu పాత్ర : వైసీపీ నేత Sajjala Ramakrishna Reddy

by Seetharam |
ఫైబర్ గ్రిడ్ స్కాంలోనూ Chandrababu Naidu పాత్ర : వైసీపీ నేత Sajjala Ramakrishna Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం దర్యాప్తులో ప్రభుత్వ ప్రమేయం ఏముంటుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. స్కిల్ స్కాం కేసు కోర్టులో ఉందని చెప్పుకొచ్చారు.డిజైన్ టెక్ ద్వారా కోట్లు కొట్టేశారని చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. లక్ష మంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబు అవుతారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని.... తాము ప్రచారం చేసే అసత్యాలను జనం నమ్మక చస్తారా అని టీడీపీ భావిస్తుందని సజ్జల అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. అడ్డంగా దొరికిన దోపిడీ దొంగల ముఠాకు ఎల్లో సపోర్ట్‌ చేస్తోందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.ఎల్లో మీడియాకు వాస్తవాలతో సంబంధం లేదని... జనం నమ్మక చస్తారా అనేదే ఎల్లో మీడియా ఆలోచన అంటూ దుయ్యబట్టారు. వీరంతా తోడు దొంగలే. ఇంతకంటే పెద్ద పదం లేదు అని అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును అరెస్ట్ చేస్తే అదేదో ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాతంగా ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

తోడు దొంగల పార్టీ

తెలుగుదేశం పార్టీ అంటే తోడు దొంగల పార్టీ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ తోడు దొంగల పార్టీకి ముఠా నాయకుడు చంద్రబాబు అని చెప్పుకొచ్చారు. స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడును కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు అని మండిపడ్డారు. ఢిల్లీలో నారా లోకేశ్ పనేంటని నిలదీశారు. ఈ 20 రోజుల్లో లోకేశ్‌ ముఠా నానా యాగీ చేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీకి గురైందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సాక్ష్యాధారాలతో దొరికితే కోర్టు రిమాండ్‌కు పంపిందని అయినప్పటికీ జరిగిన స్కామ్‌పై వీరంతా మాట్లాడటం లేదన్నారు. దొంగతనం చేసి సానుభూతి కోరుకుంటున్నారు అని మండిపడ్డారు. మేధావులు అనుకుంటున్న కొందరితో స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాదు చంద్రబాబు అరెస్ట్‌ను దేశ సమస్యలా చిత్రీకరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.దొంగతనం చేసి సానుభూతిని కోరుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.మూడేళ్లు దర్యాప్తు చేసిన ఆధారాలు లభించిన తర్వాతే చంద్రబాబును అరెస్ట్ చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఏపీ స్కిల్ స్కామ్ లో తమకు సంబంధం లేదని సీమెన్స్ సంస్థ ఇప్పటికే ప్రకటన చేసిందని చెప్పుకొచ్చారు. మొత్తం నాలుగు కేసుల్లో అన్ని ఆధారాలున్నాయని సజ్జల రామకృష్ణారెడ్ మీడియాకు తెలిపారు. కేవలం స్కిల్ స్కాం కేసు మాత్రమే కాదని ఫైబర్ గ్రిడ్ లో కూడ చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ పై రాష్ట్రపతికి వినతిపత్రమిచ్చారని.. ఐక్యరాజ్యసమితికి వినతిపత్రం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి : చంద్రబాబుకు మద్దతుగా ఈనెల30న మోత మోగిద్దాం: నారా లోకేశ్ పిలుపు



Next Story