చంద్రబాబు అరెస్ట్ ముమ్మాటికి రాజకీయ కక్షే: మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్

by Seetharam |   ( Updated:2023-10-20 11:47:12.0  )
చంద్రబాబు అరెస్ట్ ముమ్మాటికి రాజకీయ కక్షే: మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‍ రాష్ట్రం అరెస్టులప్రదేశ్‌గా తయారైందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్‍ విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపించారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అమాయకుడని..ఆయన అరెస్టులో బీజేపీ పాత్ర ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో కనీసం చిన్నపిల్లాడిని అడిగినా చంద్రబాబు అరెస్ట్ వెనుక కుట్ర బీజేపీ ఉందని చెప్తారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని చింతా మోహన్ ధీమా వ్యక్తం చేశారు. చింతా మోహన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అమాయకుడని... ఆయన ఏ తప్పు చేయలేదని తాను తనతోపాటు ప్రజలు కూడా నమ్ముతున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అరెస్ట్‌ దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. న్యాయస్థానాలపై ప్రజలకు విశ్వాసం తగ్గుతోందని..చంద్రబాబు కేసులో రుజువులు ఎక్కడ ఉన్నాయో చూపించాలని చింతా మోహన్ ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు అరెస్టుపై ప్రజాస్వామ్యవాదులు నోరు విప్పాలని.. న్యాయస్థానాలపై నమ్మకం కోల్పోతున్న పరిస్థితుల్లో సీజేఐ స్పందించాలని కోరారు. న్యాయస్థానాల్లో రాజకీయ ప్రమేయంపై సుప్రీంకోర్టు సీజే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు మార్గదర్శిపై కక్ష సాధింపు ఎందుకని నిలదీశారు. ఈ వయసులో రామోజీ రావుపై కేసులు పెట్టి వేధించడం ఎందుకని నిలదీశారు. సీపీఎస్ రద్దు చేయాలని...పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story