భారీ ఊరట: అంగళ్లు కేసులో టీడీపీ నేతలకు బెయిల్

by Seetharam |
ap highcourt
X

దిశ, డైనమిక్ బ్యూరో : అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని అంగళ్లు కేసులో టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 79 మందికి హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. బెయిల్‌పై విడుదలైన ప్రతీ ఒక్కరూ ప్రతి మంగళవారం పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం పుంగనూరు అంగళ్లు కేసులో అరెస్టైన టీడీపీ నేతలు, కార్యకర్తలు చిత్తూరు, మదనపల్లె, కడప జైలులో ఉన్న సంగతి తెలిసిందే. హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేయడంతో త్వరలో వీరంతా జైలు నుంచి విడుదల కానున్నారు. ఇకపోతే ఇదే కేసులో మరో 30 మంది టీడీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వారిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆగస్టు 5న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుంగనూరు నియోజకవర్గం అంగళ్లులో పర్యటించారు. ఈ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఈ ఘటనలో పలువురు టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం వీరంతా బెయిల్‌పై విడుదల కానున్నారు.

Advertisement

Next Story

Most Viewed