Ap News: మళ్లీ ఢిల్లీకి సీఎం జగన్.. వ్యూహం ఇదే..!

by srinivas |   ( Updated:2023-07-01 17:25:56.0  )
Ap News: మళ్లీ ఢిల్లీకి సీఎం జగన్.. వ్యూహం ఇదే..!
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం జగన్ మళ్లీ​ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 4న విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు అక్కడే బస చేసి 5న ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత హోంమంత్రి అమిత్​ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులను జగన్ కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అంశంపై చర్చించనున్నట్లు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికలకు పోవడం మంచిదని జగన్​ భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కనీసం ఏడు దశల్లో పోలింగ్​నిర్వహించే విధంగా ఈసీఐ ఆదేశాలు ఇచ్చేట్లు ఢిల్లీ పెద్దలను అడిగే అవకాశం ఉందంటున్నారు.

రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రతిపక్షాలు కూడా ఎన్నికల మూడ్​లోకి వెళ్లిపోయాయి. అధికార పార్టీలో పైకి కనిపించకున్నా నేతలు లోలోన ఉడుకుతున్నట్లు కనిపిస్తోంది. 18 మంది ఎమ్మెల్యేల గ్రాఫ్​ పెరగలేదు. మరో 25 చోట్ల ఇన్​చార్జులు, ఎమ్మెల్యేలను మార్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత వారం రోజుల నుంచి ప్రజల్లో గ్రాఫ్​ పెరగని ఎమ్మెల్యేలను జగన్​ పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు అనిల్​ కుమార్​ యాదవ్​, తెల్లం బాలరాజు, జ్యోతుల చంటిబాబు, ఉదయభాను, కిలారి రోశయ్యతో సీఎం జగన్​ మాట్లాడారు. కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా, మరికొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీకి దింపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ కసరత్తు అంతా పూర్తి చేసి తెలంగాణాతోపాటు డిసెంబరు, జనవరిలో ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా ఎన్నికలు జరిగితే తెరచాటు నుంచి ఢిల్లీ పెద్దల సహకారం ఉంటుందని సీఎం జగన్​ భావిస్తున్నట్లుంది. మరోవైపు కేంద్రంలోని బీజేపీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. వాళ్లు కూడా ముందస్తుకే వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు జాతీయ విపక్షాలు అంచనా వేస్తున్నాయి. ఈ తరుణంలో సీఎం జగన్​ ఢిల్లీ పర్యటనపై అనేక కోణాల్లో చర్చలు జరుగుతున్నాయి. గతంలో మాదిరి నిధులు, అప్పులకు అనుమతి కోసమో.. లేక హామీలు నెరవేర్చాలని అడగడానికో ఈసారి పర్యటన ఉండకపోవచ్చని కొందరు చెబుతున్నారు. కచ్చితంగా ముందస్తు ఎన్నికల గురించి చర్చించడానికేనని అంచనా వేస్తున్నారు.

ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్లేట్లయితే కనీసం ఏడు దశల్లో పోలింగ్​ నిర్వహించేట్లుండాలని సీఎం జగన్​ అడిగే అవకాశముంది. తద్వారా విపక్షాలను కట్టడి చేయడానికి దోహదపడుతుందనే ఆలోచన కావొచ్చు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఇదే ఎత్తుగడను అమలు చేసినా అధికారాన్ని చేపట్టలేకపోయింది. అయినా సీఎం జగన్​ ఒకే రోజు పోలింగ్ వద్దని చెప్పే చాన్స్​ ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు, పవన్​ దూకుడు పెంచడం, మరోవైపు పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి సీఎం జగన్​లో గుబులు రేపుతోంది. షెడ్యూల్​ ప్రకారం ఎన్నికలకు వెళ్తే కేంద్ర పెద్దల నుంచి ఎలాంటి సహకారం అందకపోవచ్చు. అందుకే జగన్​ ముందస్తుకు ప్రాధాన్యమిస్తారని విపక్షాల నుంచి వినిపిస్తోంది.

Advertisement

Next Story