- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయనపై తాడిపత్రి నియోజకవర్గ బహిష్కరణ వేటు.. నెరవేరిన జేసీపీ ఆర్ డిమాండ్
దిశ ప్రతినిధి, అనంతపురం: వైసీపీ నాయకుడు, అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఊహించని దెబ్బే తగిలింది. ఆయనపై జిల్లా ఎస్పీ జగదీశ్ నియోజకవర్గ బహిష్కరణ వేటు వేయడం ఆ పార్టీ వర్గాలను షాక్ కు గురిచేసింది. తాము అనుమతి ఇచ్చే వరకు నియోజకవర్గంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదని ఎస్పీ తేల్చి చెప్పారు. ఈ మేరకు పెద్దారెడ్డి ఇంటికి నోటీసులు పంపించారు. దీంతో తాను తాడిపత్రికి వెళతానని, అక్కడి నుంచే రాజకీయాలు చేస్తానని పెద్దారెడ్డి చేసిన ప్రతిజ్ఞకు బ్రేక్ పడినట్లయింది. ఎస్పీ నోటీసులను ఆయన ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది.
మాట నెగ్గించుకున్న జేసీపీ ఆర్
పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి, చివరికి జిల్లా నుంచి కూడా బహిష్కరించాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెడితే పంచె ఊడదీసి కొడతామని కూడా నెలరోజుల క్రితం ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరిక చేశారు. అందుకు తగ్గట్టు మరుసటి రోజే పెద్దారెడ్డి తాడిపత్రిలో ప్రత్యక్షం కావడం ద్వారా పరోక్షంగా జేసీకి సవాల్ విసిరారు. ఘర్షణలేమైనా తలెత్తుతాయేమోననే ఉద్దేశంతో పోలీసులు ఆయనను బలవంతంగా అనంతపురానికి తీసుకువచ్చి వదిలిపెట్టి వెళ్లిపోయారు. అనంతరం ఆయన అప్పటి ఎస్పీని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాడిపత్రి ఏమైనా జేసీ కుటుంబ జాగీరా అని ప్రశ్నించారు. తాడిపత్రికి వెళతా.. అక్కడినుంచే రాజకీయాలు చేస్తానని కూడా స్పష్టం చేశారు. తాజాగా నాలుగు రోజుల క్రితం తిరిగి తాడిపత్రికి వెళ్లారు. దీంతో అక్కడ ఘర్షణలు తలెత్తాయి. వైసీపీ నాయకుడు కందిగోపుల మురళి ఇంటికి దుండగులు నిప్పంటించారు. రెండు వాహనాలను ధ్వంసం చేశారు. పెద్దారెడ్డి ఇంటిపై కూడా రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు పెద్దారెడ్డిని తిరిగి అనంతపురానికి తీసుకువచ్చి వదిలిపెట్టారు.
పెద్దారెడ్డికి బాసటగా నిలిచిన పలువురు వైసీపీ నేతలు
ఈసారి పెద్దారెడ్డికి బాసటగా పలువురు వైసీపీ నేతలు నిలిచారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి, మాజీ మంత్రి శంకర నారాయణ తదితరులు పెద్దారెడ్డితో వెళ్లి ఎస్పీని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక మాజీ ఎమ్మెల్యేకి తన నియోజకవర్గంలో అడుగుపెట్టే అవకాశమే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే తామంతా కలిసి వెళ్లి తాడిపత్రిలో ఆయనను దిగబెట్టి వస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ సైతం ఒక మాజీ ఎమ్మెల్యేకి తన నియోజకవర్గంలో అడుగుపెట్టే అవకాశం లేదంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేక రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉన్నట్టా అని ప్రశ్నించారు. ఎంతమంది బాసటగా నిలిచినా బహిష్కరణ వేటు పడకుండా పెద్దారెడ్డిని కాపాడలేకపోయారు.
బహిష్కరణకు కారణమేమిటి?
తాడిపత్రిలో పోలింగ్ రోజు, అనంతరం జరిగిన ఘర్షణలకు పెద్దారెడ్డి ప్రధాన కారకుడు. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్న క్రమంలో ఇరు వర్గాల నేతలను తాడిపత్రి నుంచి బయటకు పంపించేశారు. పలు కేసులు నమోదు చేశారు. కొంతకాలం తర్వాత కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసులకు జామీను ఇచ్చిన 15 రోజుల తర్వాత మాత్రమే తాడిపత్రిలో అడుగుపెట్టే అవకాశముంది. అయితే జామీను తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది పెద్దారెడ్డి ఆరోపణ. తాను ఓడినా గెలిచినా ఫ్యాక్షన్ చేస్తానని పెద్దారెడ్డి గతంలో ప్రకటన చేసినందున ఆయనను జిల్లా నుంచి బహిష్కరించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేస్తూ వచ్చారు. వైసీపీ హయాంలో టీడీపీ నాయకుడు పొట్టి రవిని అయిదేళ్లపాటు రాష్ట్రం నుంచి బహిష్కరించిన విషయాన్ని ఉదహరించారు. మొత్తం మీద అనుమతి లేకపోయినా తరచూ తాడిపత్రిలో అడుగుపెడుతూ అల్లర్లకు ఉసి గొలుపుతున్నారనేది ఆయనపై వేటుకు ప్రధాన కారణం.
తాడిపత్రి మున్సిపల్ మహిళా కౌన్సిలర్లు చేసిన హెచ్చరిక కూడా ఇందుకు కారణమేనని చెప్పవచ్చు. అనంతపురంలో ఎస్పీని కలిసిన వైసీపీ నేతలందరి ఇళ్ల వద్ద 29వ తేదీ ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి సహా మా అందరిపైనా లెక్కకు మిక్కిలిగా తప్పుడు కేసులు నమోదు చేయించిన నరరూప రాక్షసుడికి మద్దతుగా నిలుస్తారా అని వారు ప్రశ్నించారు. దీన్ని నిరసిస్తూ తాము 29న ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే పెద్దారెడ్డి పై వేటు పడటం చర్చనీయాంశంగా మారింది. ఇరు పక్షాల నాయకులు తాడిపత్రిలో ఉంటే ఇలాంటి ఘర్షణలే ఉంటాయని డీజీపీ నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. దీంతో గెలిచిన జేసీ అస్మిత్ రెడ్డి కుటుంబాన్ని అలానే ఉంచి.. వివాదాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకుడు, పెద్దారెడ్డిని నియోజకవర్గం నుంచి బహిష్కరిస్తూ.. ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.