సూత్రధారులెవరు ?.. అలజడి రేపిన ‘దిశ’ కథనం

by Javid Pasha |
సూత్రధారులెవరు ?..  అలజడి రేపిన ‘దిశ’ కథనం
X

దిశ, కుక్కునూరు: పోలవరం పరిహారం విషయంలో జరుగుతున్న భారీ మోసం వెనుక ఎవరి హస్తం ఉంది? నిర్వాసితుల జాబితాలో పేర్లు మార్పిడి వెనుక పాత్రధారులు ఎవరు? అసలు జాబితాను ఎందుకు బహిరంగ పర్చడం లేదు? ఎందుకు కొందరి పేర్లను రహస్యంగా ఉంచారు? అనే ప్రశ్నలు ఇప్పుడు కుక్కునూరు మండల నిర్వాసితుల నుంచి వస్తున్న ప్రశ్నలు. పోలవరం పరిహారం లో జరుగుతున్న భారీ మోసంపై " దోచుకో.. పంచుకో" పేరిట 'దిశ'..లో ప్రచురితమైన కథనం అధికారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

తప్పించుకునే పనిలో అక్రమార్కులు

అధికారుల ప్రమేయం స్పష్టంగా ఉండటంతో ఎవరికీ వారు తలలు పట్టుకుంటున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళడంతో అక్రమార్కులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కుక్కునూరు ఏ బ్లాక్ పరిధిలో ఇటీవల నిర్వాసితుల ఇళ్ల పరిహారం జాబితా గ్రామసభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారులతో కలిసి కొందరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవడం చర్చనీయాంశమైంది. అర్హులైన నిర్వాసితుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. 'దిశ' కథనంతో ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనర్హులను పరిహారపు జాబితాలో చేర్చేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.30 వేల వరకు కమిషన్ రూపంలో తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు

ఏ, బీ,సీ బ్లాక్ నిర్వాసితుల పేర్లు బహిరంగ పరచకుండా రహస్యంగా ఉంచడం పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఎంతెంత మారాయో అన్న విషయంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. బ్లాక్ తో సంబంధం లేకుండా ఇంటి పన్నులు ఎలా ఇచ్చారు? అనర్హులు ఎలా జాబితాలో చేరారు అన్న దానిపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.

అధికారులకు ఫిర్యాదు..

పోలవరం ఇంటి పరిహారం జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు చేపట్టాలని కుక్కునూరు మండల నాయకులు, నిర్వాసితులు కలెక్టర్, పోలవరం భూ సేకరణ అధికారికి ఫిర్యాదు చేశారు. ఇంటి పరిహారం విషయంలో అవకతవకలు జరిగాయని, సమగ్ర విచారణ చేపట్టలని కోరారు. సర్వం కోల్పోతున్న అభాగ్యుల పొట్ట కొట్టి ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.

Advertisement

Next Story