లేని భూమిని రూ.17 లక్షలకు విక్రయించిన మాయగాళ్లు

by Gantepaka Srikanth |
లేని భూమిని రూ.17 లక్షలకు విక్రయించిన మాయగాళ్లు
X

దిశ, ఏపీ బ్యూరో: ఎవరిదో భూమిని తమదిగా మ్యుటేషన్ చేయించుకున్నారు. వీఆర్వో నుంచి తహసీల్దారు దాకా పెద్ద ఎత్తున ముడుపులు దండుకున్నారు. రికార్డుల్లో మాత్రమే నమోదైన భూమిని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి అమ్మేశారు. తీరా క్షేత్ర స్థాయిలో భూమి మీదకు వెళ్తే.. అసలు హక్కుదారులు ముందుకొచ్చారు. మోసపోయానని తెలుసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కలెక్టర్ గ్రీవెన్స్‌లో మొర పెట్టుకున్నారు. రెవెన్యూ సిబ్బందిపై విచారణ చేపట్టి కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. విచారణలో తప్పుడు అధికారులను తప్పించారు. పోలీసులు సైతం కేసును బుట్టదాఖలు చేశారు. తనకు న్యాయం చేసేదెవరంటూ ఆ సాఫ్ట్‌‌వేర్ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

2023 జనవరిలో భూమి కొనుగోలు

అది ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ఏ కొండూరు మండలం పోలిశెట్టిపాడు గ్రామం. తాతా వెంకటేశ్వర్లు కుమారులు తాతా నరసింహారావు, విష్ణు కలిసి తమకున్న 1.15 ఎకరాల భూమిలోని 57.50 సెంట్లను సాఫ్ట్‌‌వేర్ ఉద్యోగి ఆనం వినయ్‌‌బాబుకు 2023 జనవరిలో విక్రయించారు. రెవెన్యూ రికార్డుల్లో పక్కాగా ఉన్నట్లు కనిపించడంతో కొనుగోలు చేసిన వినయ్ బాబు భూమ్మీదకు వెళ్లగానే అసలు హక్కుదారులు వచ్చారు. హతాశుడైన వినయ్ బాబు తనను మోసం చేసిన తాతా నరసింహారావు, విష్ణుతోపాటు అక్రమంగా రికార్డుల్లో మ్యుటేషన్ చేసిన అధికారులపై కలెక్టర్ స్పందన కార్య క్రమంలో ఫిర్యాదు చేశాడు.

ఇది సివిల్ కేసు.. కోర్టులోనే తేల్చుకోండి : తహసీల్దార్

ఈ భూబాగోతంపై విచారణ చేపట్టాలని జిల్లా సివిల్ సప్లయిస్ శాఖ మేనేజరును కలెక్టరు ఆదేశించారు. ఆయన రెవెన్యూ సిబ్బంది అరాచకాన్ని కప్పిపుచ్చారు. ఇది సివిల్​ కేసంటూ న్యాయ స్థానాల్లో తేల్చుకోవాలని సెలవిచ్చారు. దీంతో ప్రస్తుత తహసీల్దారు ఈ కేసు పరిష్కారమైనట్లు తేల్చేశారు. ఈ మోసకారితనంపై తిరువూరు పోలీసు స్టేషన్​లో కేసు నమోదయింది. చివరకు పోలీసులూ కేసును నీరుగార్చారు. లేని భూమిని విక్రయించిన వాళ్లు దర్జాగా వైసీపీ కండువా వదిలేసి ఏలూరు ఎంపీ దగ్గర పాగా వేశారు. బాధితుడు వినయ్ బాబు డిప్యూటీ సీఎం పవన్‌‌ను కలిసి మొర పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది.

రికార్డుల ట్యాంపరింగ్

రెవెన్యూ రికార్డుల ప్రకారం 2020 దాకా ఆర్ఎస్ నంబరు 25లోని 1.15 ఎకరాల భూమి ఇతరుల పేరుతో ఉంది. సదరు భూమి పూర్వీకుల నుంచి తమకు దఖలు పడినట్లు తాతా నరసింహారావు, విష్ణు రెవెన్యూ సిబ్బందికి చెప్పారు. ముడుపులు దండుకొని అధికారులు రికార్డులకు ఎక్కించారు. 1986లోనే సదరు భూమిని నరసింహారావు, విష్ణు పూర్వీకులు అదే గ్రామానికి చెందిన తాళ్లూరి వెంకటేశ్వరరావు, తిరుపతి, వెంకయ్యకు విక్రయించినట్లు ఈసీలో బయటపడింది. తర్వాత వాళ్లు వాసం రవికిరణ్​కు 2019లో అమ్మినట్లు తెలిసింది. వీటన్నింటిని పక్కన పెట్టి 2020లో నరసింహారావు, విష్ణు కలిసి ఓ పార్టిషన్​ డాక్యుమెంటును చూపించి సదరు భూమి తమదిగా రికార్డుల్లో నమోదు చేయించారు. ఇంత పక్కాగా సాఫ్ట్ వేర్​ ఉద్యోగి వినయ్​ బాబును రికార్డుల ట్యాంపరింగ్​తో మోసం చేసి విక్రయించినట్లు బయటపడినా ప్రభుత్వం దోషులపై ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాకు న్యాయం చేసేదెవరంటూ వినయ్ బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed