- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Politics: కొత్త ప్రయోగం.. దేశంలో ఇదే ప్రథమం
దిశ, ఏపీ బ్యూరో: నైపుణ్య గణన.. బహుశా ఈ పేరు వినిపించడం ఇదే ప్రథమం. దేశంలో అనేక గణనలు చేపడుతున్నారు. యువత నైపుణ్యం, అభిరుచులపై సర్వే చేయడం హర్షణీయం. తద్వారా వాళ్లు ఏ రంగంలో ఆసక్తి చూపిస్తున్నారు.. ఆ మేరకు వాళ్లకు నైపుణ్యం కల్పించడం ప్రభుత్వ కర్తవ్యం. కూటమి సర్కారు ఆ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడంపై నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాల్లో ఇదొకటి కావడం విశేషం. ఈపాటికే యంత్రాంగం దీనిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో సుమారు కోటి మంది యువత
రాష్ట్రంలో సుమారు కోటి మంది యువత ఉండొచ్చని అంచనా. ప్రభుత్వ ఉద్యోగులు, వృత్తి నిపుణులు, వ్యాపార రంగంలో స్థిరపడిన వాళ్లు 30 శాతం ఉంటారు. మరో 40 శాతం మంది అసంఘటిత రంగంలో వెట్టి చాకిరి చేస్తూ చాలీచాలని వేతనాలతో కాలం నెట్టుకొస్తున్నారు. మిగిలిన వాళ్లకు కొలువుల్లేక.. కుటుంబాలకు భారమై ఉద్యోగ ప్రయత్నాల్లో తలమునకలవుతున్నారు.
సుమారు మూడు దశాబ్దాల నుంచి విద్యా రంగంలో వచ్చిన మార్పుల వల్ల యువత వైట్ కాలర్జాబ్స్పై ఆశలు పెట్టుకుంది. ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగంలో లక్షల కొద్దీ వేతనాలున్నందున యువత అటువైపు ఆకర్షితులయ్యారు. వాస్తవానికి ప్రస్తుత నిరుద్యోగ సైన్యం మొత్తానికి ఉపాధి కల్పించే స్థాయి ఆ రంగానికి లేదని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయాన్ని అద్భుత జీవనశైలిగా మార్చాలి
మెజార్టీ ప్రజలు ఆధారపడిన వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఇప్పటిదాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన ఊతమివ్వలేదు. నికర ఆదాయమిచ్చే స్థాయిలో ఈ రంగాలను అభివృద్ధి చేయలేదు. ఇప్పటికీ వ్యవసాయం చేసే యువతకు పలు సామాజిక వర్గాల్లో పెళ్లిళ్లు కావడం లేదు. పంటలు పండించే రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి మారకుండా వ్యవసాయంలోకి యువతను తీసుకురావడం కష్టం. వ్యవసాయాన్ని ఓ అద్భుత జీవన శైలిగా మార్చగలిగినప్పుడే ఈ రంగంలో ఉపాధి వైపు యువత చూసే అవకాశాలుంటాయి.
అనుబంధ రంగాలను ప్రోత్సహించాలి
వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి దాని అనుబంధ రంగాలతోనే సాధ్యమవుతుంది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చేపట్టినప్పుడే వలసలకు ఫుల్‌స్టాప్ పడుతుంది. గ్రామీణ నిరుద్యోగాన్ని తగ్గించడం వల్ల వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. అంతిమంగా అది అర్బన్పారిశ్రామిక, సేవల రంగం వృద్ధికి దోహదపడుతుందని ఆర్థిక నిపుణులు వెల్లడిస్తున్నారు. నేడు చదివిన చదువుకు పొంతన లేని కొలువుల్లో ఎందరో యువత ఆక్రోశిస్తున్నారు.
అందువల్ల ఉన్నత విద్యారంగంలో పలు సంస్కరణలు తీసుకురావాలి. ఏ రంగానికైతే ప్రభుత్వం ఊతమిస్తుందో అటువైపు యువత నైపుణ్యాలను తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.
పరిశ్రమలు స్థాపించే యువతకు రూ.పది లక్షల నగదు
వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి కల్పనతో పరిశ్రమలు స్థాపించే యువతకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పది లక్షల నగదు ఇస్తామని జనసేన మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇలా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కనీసం పది మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామని కూడా పేర్కొన్నారు.
అయితే ఏ రంగాల్లో పరిశ్రమలకు ఊతమిస్తారు.. అవి లాభసాటిగా నడవడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు ఉంటుందనే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ప్రస్తుతం చేపట్టనున్న నైపుణ్య గణన కూడా పవన్సూచన మేరకే ప్రభుత్వం చేపడుతున్నట్లు జనసేన పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.