- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల రాష్ట్రంగా మార్చేశారు : చంద్రబాబు
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల రాష్ట్రంగా మార్చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ శాసనసభా, మండలి పక్ష నేతలతో పాటు ఇతర ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను ఇష్టానుసారంగా తనఖా పెడుతున్నారని ధ్వజమెత్తారు. అప్పుల కార్పొరేషన్ పెట్టి రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి, విచ్చలవిడిగా అప్పులు చేసి.. ఆ డబ్బును స్కామ్‌లు చేసే స్కీమ్‌లకు మళ్లించి హోల్ సేల్ అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
చెత్తపై పన్ను, మున్సిపల్ పన్ను, రేషన్ కార్డుపై పన్ను, చివరకు వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారని విరుచుకుపడ్డారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. మాజీమంత్రి దేవినేని ఉమా బెయిల్‌పై విడుదలై బయటకు వస్తే.. చట్టవిరుద్ధంగా జాతీయ రహదారిని బ్లాక్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమాన్ దేవాలయాన్ని కూడా మూసివేయడం దురదృష్టకరమన్నారు. పులిచింతల ప్రాజెక్టు విషయంలో నిర్వహణ సరిగాలేదని తాము మెుదటి నుంచి ఆరోపిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
వైఎస్ హయాంలోనే పులిచింతల ప్రారంభమైందని.. అప్పుడు నాసిరకం పనులు జరగడం వల్లే గేటు కొట్టుకుపోయిందన్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టును జగన్ సర్కార్ పూర్తిగా భ్రష్టు పట్టించిందని.. నిర్వాసితులకు పరిహారం కూడా చెల్లించడం లేదని మండిపడ్డారు. విశాఖలో బాక్సైట్ మైనింగ్‌తో వేలాది కోట్లు దోచుకుంటున్నారని, కానీ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తుంటే అడ్డుకోలేకపోతున్నారని విరుచుకుపడ్డారు.
తరలిపోతున్న పరిశ్రమలు
ఈ ప్రభుత్వం అరాచకాలకు భయపడి ఆసియా పేపర్, 17 కియా అనుబంధ పరిశ్రమలు, సింగపూర్ అంకుర పరిశ్రమల ప్రాజెక్టు, విశాఖలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, తిరుపతిలో రిలయన్స్ లాంటి అనేక పరిశ్రమలు తరలిపోయాయన్నారు. ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాల వల్ల లక్షలాది ఉద్యోగాలు, ఆదాయం కోల్పోవడం జరిగిందన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేరుతో అమరరాజాలాంటి సంస్థలను మూసివేయించే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేశారని.. భూములు ఇచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. గురజాలలో ఓ మైనారిటీ వ్యక్తిని పోలీసులు కొట్టడంతో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని చంద్రబాబు ఆరోపించారు.
రాష్ట్రంలో లిక్కర్ మాఫియాకు జగన్ రెడ్డి తెరలేపారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తమ హయాంలో సంపద సృష్టిస్తే వైసీపీ ప్రభుత్వంలో సహజ వనరులను వైసీపీ నేతలు అందినకాడికి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. అలాగే కృష్ణా, గోదావరి జలాలపైన బచావత్ కమిషన్ ఏపీకి కల్పించిన హక్కుల్ని రక్షించడంలో జగన్ పూర్తిగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.