పులిజాడలో కాసులవేట!

దిశ, ఆదిలాబాద్: ఇదేమి ఆషామాషీ వ్యవహారం కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఆశయమూ ఇమిడి ఉన్నది. అయితే ప్రాజెక్ట్ పేర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడి ఆదివాసులతో ఆడుతున్న ఆట.. పులి కోసమా? వారి జీవితాలను పణంగా పెట్టడం కోసమా! అన్నది తేలాల్సి ఉంది. 2012.. అంటే సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట మొదలుపెట్టిన ప్రాజెక్టు అది. కవ్వాల అభయారణ్యం కాస్త.. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టుగా మారింది. […]

Update: 2020-03-07 05:09 GMT

దిశ, ఆదిలాబాద్: ఇదేమి ఆషామాషీ వ్యవహారం కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఆశయమూ ఇమిడి ఉన్నది. అయితే ప్రాజెక్ట్ పేర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడి ఆదివాసులతో ఆడుతున్న ఆట.. పులి కోసమా? వారి జీవితాలను పణంగా పెట్టడం కోసమా! అన్నది తేలాల్సి ఉంది.

2012.. అంటే సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట మొదలుపెట్టిన ప్రాజెక్టు అది. కవ్వాల అభయారణ్యం కాస్త.. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టుగా మారింది. ఆశయమల్లా ఈ ప్రాంతంలో పులుల సంరక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేయడమే. కానీ ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా పులులు కనిపించక పోవడంతో అసలు ఇక్కడ టైగర్ జోన్ కొనసాగిద్దామా..వద్దా..! అన్న సంశయం ఇప్పుడు అటవీశాఖ వర్గాలను ఆలోచింపజేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన కవ్వాల్ టైగర్ రిజర్వ్ పులుల సంరక్షణకు ఏమంత సురక్షితం కాదని తేలిపోతున్నది. ఇప్పటిదాకా టైగర్ జోన్ కోర్ ఏరియాలో పులుల జాడ లేకపోగా..టైగర్ జోన్‌తో సంబంధమే లేని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో తరచుగా పులుల సంచారం నమోదు అవుతుండటం అటవీ అధికారులను వేధిస్తున్నది.

జాతీయ పులుల సంరక్షణ కేంద్రం అంచనాల మేరకు సుమారు వెయ్యి నుంచి రెండు వేల కోట్ల ప్రాజెక్టుల మాదిరిగానే కవ్వాల్ పులుల అభయారణ్యం మంజూరైంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పేరుతో కోట్లాది రూపాయలను ఖర్చు చేశారు. టైగర్ ప్రాజెక్టు కింద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 18 గ్రామాలను పునరావాసం కోసం ఇతర ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మండలం రాంపూర్, మైసంపేట గ్రామాలను ఎంపిక చేశారు. పరిహారం చెల్లింపులో మాత్రం అధికారులు ఇదిగో అదిగో ఇస్తామంటూ జాప్యం వహిస్తున్నారు. కారణాలు విశ్లేషిస్తే ఈ ప్రాంతంలో టైగర్ జోన్ ఫలితాన్నిస్తుందా.. లేదా.. అన్న అనుమానం ఆ శాఖ ఉన్నతాధికారులను కలవరపెడుతున్నది. మరోవైపు క్షేత్రస్థాయిలో మాత్రం ప్రాజెక్టు కోసం విడుదలవుతున్న నిధులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. గడిచిన ఎనిమిదేళ్లలో ఇప్పటిదాకా రూ. 100 కోట్ల మేర ఖర్చు పెట్టారని తెలుస్తున్నది. జాడలేని పులి కోసం అటవీ అధికారులు కాసుల వేట అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు పులి ఉందా..?

అసలు ఈ అభయారణ్యంలో ఇప్పటిదాకా ఎన్ని పులులు ఉన్నాయో లెక్క చెప్పలేని పరిస్థితిలో అటవీశాఖ ఉన్నది. గతేడాది ఖానాపూర్ సమీపంలో కనబడిన పులి మినహా ఇప్పటి దాకా పులి జాడ లేదు. పులుల సంరక్షణ పేరిట కవ్వాల్ అభయారణ్యం కాస్త టైగర్ జోన్‌గా మారిపోయింది. ఉమ్మడి జిల్లాలోని కడెం ఖానాపూర్, జన్నారం, పెంబి, ఉట్నూర్, ఇచ్చోడ మండలాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో 80 శాతానికి పైగా అడవులు టైగర్ జోన్ కోర్ ఏరియాగా అధికారులు గుర్తించారు. ఇక మిగిలిన మామడ నిర్మల్, సిర్పూర్, జైనూరు, ఆసిఫాబాద్, కెరమెరి, నార్నూర్, దండేపల్లి ప్రాంత అడవుల్లోని కొంత అటవీ ఏరియాను బఫర్ జోన్‌గా ప్రభుత్వం గుర్తించింది. అయితే ఈ ప్రాంతాల్లో ఇప్పటిదాకా పులుల సంచారం నమోదు కాలేదు. దీనికి గల కారణాలు ఏమిటన్నది అధికారులకు కూడా అంతుచిక్కడం లేదు.

దారి తప్పిన పెద్ద పులి…

కవ్వాల్ అభయారణ్యంలోకి వస్తాయనుకున్న పెద్ద పులులు దారి తప్పినట్లు అవగతం అవుతున్నది. గత నెల రోజుల వ్యవధిలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెద్ద పులులు కవ్వాల్ అభయారణ్యంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండటం, అక్కడి ప్రాంతాల ప్రజలకు కనిపిస్తుండటం గమనార్హం. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి, భీంపూర్ మండలాల్లో పెద్దపులి కదలికలు కనిపించాయి. అక్కడి రైతులకు కనిపించిన పెద్దపులి సమాచారం అటవీ అధికారులకు చేరింది. అడవుల్లో పులి తాలూకు అడుగుల గుర్తులు ఉండటంతో.. ఈ ప్రాంతంలో పులుల సంచారం ఉన్నట్లు అధికారులు అంగీకరిస్తున్నారు. తాజాగా తూర్పు జిల్లాలోని కోటపల్లి, వేమనపల్లి ప్రాంతాల్లో పులి సంచారం ఉన్నట్లు గుర్తించారు. ఆదివారం కోటపల్లి మండలంలో పశువులపై పులి దాడి చేసిన ఘటన కూడా చోటు చేసుకుంది. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే మూడు చోట్ల పులుల సంచారం నమోదైంది. అయితే ఈ ప్రాంతమంతా టైగర్ జోన్‌లోకి రాకపోవడం గమనార్హం.

తాడోబా నుంచి ప్రాణహిత మీదుగా…

మహారాష్ట్రలో ఉన్న తాడోబా-అందేరి టైగర్ రిజర్వు నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యానికి పులులు వస్తాయని అటవీ అధికారులు అంచనా వేశారు. అయితే అవి కవ్వాల్‌కు కాకుండా మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ప్రాణహిత నది తీరం గుండా తూర్పు జిల్లా ప్రాంతంలోకి వస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా పశ్చిమ జిల్లాలోని ఆదిలాబాద్ వైపుకు మహారాష్ట్రలోని చంద్రపూర్, మాణిక్ గడ్ మీదుగా ఉన్న అడవుల గుండా వస్తున్నాయని అటవీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే కవ్వాల్ అభయారణ్యంలో ఇప్పటికే మూడు పులులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అది నిజమో కాదో ఎవరికీ తెలియదు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా టైగర్ జోన్‌లో కనిపించని పులులు కవ్వాల్ బయటి అటవీ ప్రాంతాల్లో కనిపిస్తుండటం అధికార వర్గాలను విస్మయానికి గురి చేస్తున్నది.

Tags: Tiger Zone, Kawal Tiger Reserve project, 2012, Adilabad Forest

Tags:    

Similar News