హుజురాబాద్‌లో అభ్యర్థి లేకున్నా.. 200 మందితో షర్మిల భారీ ప్లాన్

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఉప ఎన్నికలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల ఫోకస్ పెట్టారు. ప్రత్యక్షంగా పార్టీ తరుఫున కాకుండా పరోక్షంగా తన మార్క్ చూపాలని ప్లాన్ చేసుకుంటున్నారు. గతంలో ఈ ఎన్నికలు పరువు, ప్రతిష్టల కోసం వచ్చినవని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పిన ఆమె తాజాగా తన ఉద్యమానికి ఈ ఎన్నికలను అడ్డాగా మార్చుకోవాలని భావిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 200 మంది నిరుద్యోగులను ఈ ఎన్నికల బరిలో నిలపాలని స్కెచ్ […]

Update: 2021-08-21 17:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఉప ఎన్నికలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల ఫోకస్ పెట్టారు. ప్రత్యక్షంగా పార్టీ తరుఫున కాకుండా పరోక్షంగా తన మార్క్ చూపాలని ప్లాన్ చేసుకుంటున్నారు. గతంలో ఈ ఎన్నికలు పరువు, ప్రతిష్టల కోసం వచ్చినవని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పిన ఆమె తాజాగా తన ఉద్యమానికి ఈ ఎన్నికలను అడ్డాగా మార్చుకోవాలని భావిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 200 మంది నిరుద్యోగులను ఈ ఎన్నికల బరిలో నిలపాలని స్కెచ్ వేశారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వానికి రైతులు నామినేషన్లు వేసినట్లుగానే హుజురాబాద్‌లోనూ నిరుగ్యోగులను బరిలోకి దింపి తమ పార్టీ పూర్తి మద్దతును అందించి తెలంగాణ సర్కార్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నిరుద్యోగ సమస్యలను దేశస్థాయిలో చర్చ జరిగేలా షర్మిల కార్యాచరణను రూపొందించుకుంటున్నారు.

సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ హుజురాబాద్ పోరు కాస్త బహుముఖ పోరుగా మారింది. ఎవరికి వారు ప్రభుత్వంపై వారి వారి నిరసనలను తెలియజేసేందుకు ఈ ఎన్నికలను అస్త్రంగా మార్చుకుంటున్నారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే ఎన్నికల్లో భారీగా నామినేషన్లు వేస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు. ఇప్పటికే త‌న మ‌ద్దతు నిరుద్యోగుల ప‌క్షాన ఉంటుంద‌ని ఇటీవల షర్మిల ప్రకటించారు. నేరుగా పోటీకి దిగకుండానే త‌న పార్టీ గురించే చ‌ర్చ జ‌రిగేలా కార్యాచరణ రూపొందించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దీనివల్ల అటు పార్టీకి మైలేజ్ తో పాటు జనాల్లోకి వెళ్లవచ్చని ఆమె భావిస్తున్నారు. నిజామాబాద్ ప‌సుపు బోర్డు ఉద్యమ స్థాయిలో నిరుద్యోగ ఉద్యమానికి ప్రణాళికలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నిక‌ల‌పై దేశవ్యాప్తంగా ఫోక‌స్ ఉంటుంది కాబట్టి ఎంత‌మంది అభ్యర్థులను నిల‌బ‌డితే అంత స్థాయిలో చర్చ జరుగుతుందని ష‌ర్మిల‌ భావిస్తున్నారు. నిరుద్యోగంపై చ‌ర్చ మొదలైతే క్రమంగా స‌క్సెస్ అవ్వొచ్చనే భావనలో ఆమె ఉన్నారు.

తెలంగాణ‌లో హుజురాబాద్ ఉప ఎన్నిక‌ కాక రేపుతోంది. అయితే రాజ‌కీయంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య ప్రధాన పోటీ ఉన్నప్పటికీ ఈ ఎలక్షన్లో కొత్త పార్టీ అయిన వైఎస్సార్ టీపీ పేరు కూడా వినిపించాలని ఆ పార్టీ చీఫ్ ష‌ర్మిల స‌న్నాహాలు చేస్తున్నారు. నేరుగా త‌న పార్టీ త‌రుఫున అభ్యర్థిని బరిలోకి దింపి అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, ప‌రోక్షంగా ఎన్నిక‌ల్లో ప్రభావితం చేయాలని షర్మిల ప్లాన్ చేశారు. అందుకే తను ఎంచుకున్న నిరుద్యోగ ఉద్యమానికి హుజురాబాద్ ఎన్నికలకు లింక్ పెట్టి పార్టీ పూర్తి మద్దతును నిరుద్యోగులకు అందించాలని ప్రణాళికలు చేస్తున్నారు. ఇటీవల హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో షర్మిల చేపట్టిన నిరాహార దీక్షలో నిరుద్యోగులు భారీగా నామినేషన్లు వేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ లో సీఎం కూతురు కవితను ఓడించినట్లుగానే ఇక్కడ కూడా టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించేలా కార్యాచరణను రూపొందిస్తున్నారు. అలా అయితేనే సీఎం కేసీఆర్ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టొచ్చని షర్మిల వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News