తొలిసారి మీడియా ముందుకు షర్మిల.. ఆమె కామెంట్స్‌పై సర్వత్ర ఉత్కంఠ

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పార్టీ ఏర్పాటు ప్రకటన అనంతరం వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల తొలిసారి మీడియా ముందుకు రానున్నారు. లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను ఎత్తిచూపుతూ.. తామేం చేయాలనే మెసేజ్‌ను రాష్ట్ర ప్రజలకు అందించేలా ఆమె ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆమె ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో తమ పార్టీ ఆవశ్యకత, తాము అధికారంలోకి […]

Update: 2021-07-15 10:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పార్టీ ఏర్పాటు ప్రకటన అనంతరం వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల తొలిసారి మీడియా ముందుకు రానున్నారు. లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను ఎత్తిచూపుతూ.. తామేం చేయాలనే మెసేజ్‌ను రాష్ట్ర ప్రజలకు అందించేలా ఆమె ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆమె ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో తమ పార్టీ ఆవశ్యకత, తాము అధికారంలోకి వస్తే రాజన్న సంక్షేమ పాలన ఎలా ఉండబోతోంది అనే అంశాలపై షర్మిల మాట్లాడనున్నారు.

తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన నాటి నుంచి ఆవిర్భావం వరకు ఎన్నడూ మీడియా ముందుకు వైఎస్ షర్మిల రాలేదు. జూలై 8వ తేదీన పార్టీ ఆవిర్భావం అనంతరం తొలిసారి మీడియా ముందుకు రానుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా ఆమె విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్లపై ఆమె ప్రతీ మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షకు దిగిన విషయం కూడా తెలిసిందే. పాలనలోని వైఫల్యాలపై ఆమె ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా ప్రెస్ మీట్ పెట్టడంతో ఎలాంటి అంశాలను ఆమె ప్రస్తావించనున్నారా అని అభిమానులు, నాయకులంతా ఎదురుచూస్తున్నారు.

దున్నపోతుపై వానపడినట్లు కేసీఆర్ తీరు..

నిరుద్యోగులు ఒక్కొక్కరు ప్రతీ రోజు ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నా దున్నపోతు మీద వాన పడినట్లుగా కేసీఆర్ తీరుందని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల గురువారం ట్విట్టర్‌లో మండిపడ్డారు. మొన్నటికి మొన్న వనపర్తి జిల్లా తాడిపత్రి గ్రామానికి చెందిన కొండల్ నోటిఫికేషన్లు లేక బలవన్మరణానికి పాల్పడగా నేడు ఖమ్మం జిల్లా పెనుబల్లి గ్రామానికి చెందిన నాగేశ్వర్ రావు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతమంది చస్తే నాకేంటి? నా ఇంట్లో ఎవరన్నా చస్తున్నారా అని కేసీఆర్ చూస్తున్నారే తప్పా.. నిరుద్యోగులను కాపాడుకునేందుకు మాత్రం నోటిఫికేషన్లు వేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగాల కోసం కన్న బిడ్డలను పోగొట్టుకొన్న ఆ తల్లిదండ్రుల ఆవేదన మీకెలా తెలుస్తుంది కేసీఆర్ అంటూ చురకలంటించారు. ఇప్పటికే ఎంతోమంది తల్లులకు కడుపుకోతను మిగిల్చారు.. మరో తల్లి ఆ బాధను అనుభవించకముందే, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రతీ ఉద్యోగాన్ని భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నిరుద్యోగులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, వారందరికీ అండగా నిలిచి వైఎస్సార్ తెలంగాణ పార్టీ పోరాడుతుందని షర్మిల పేర్కొన్నారు.

Tags:    

Similar News