యూత్ ఇన్ డైలమా?
దిశ, ఫీచర్స్: యూత్.. చూస్తే రెండక్షరాలే గానీ, అదో భావోద్వేగాల కలబోత. కావాల్సింది దక్కించుకునేందుకు ఆరాటం.. చేజారిపోతే తన్నుకొచ్చే ఆక్రోశం.. అనుకున్నది సాధిస్తే పొందే ఆనందం.. బరువుగా ఫీలయ్యే బాధ్యతలు.. చెప్పాలంటే జీవితంలో ఇదొక కీలక ప్రయాణం. లక్ష్యం దిశగా పడే తొలి అడుగులకు శ్రీకారం చుట్టేది.. ఫ్యూచర్‌లో వారి లైఫ్ కలర్‌ఫుల్‌గా ఉండబోతుందా లేదా కష్టాల కడలి కానుందా డిసైడ్ అయ్యేది.. ఇక్కడే. నిన్ను అందలం ఎక్కించాలన్న లేదా అధ:పాతాళానికి పడేయాలన్నా ఆ పవర్ యవ్వనంలో […]
దిశ, ఫీచర్స్: యూత్.. చూస్తే రెండక్షరాలే గానీ, అదో భావోద్వేగాల కలబోత. కావాల్సింది దక్కించుకునేందుకు ఆరాటం.. చేజారిపోతే తన్నుకొచ్చే ఆక్రోశం.. అనుకున్నది సాధిస్తే పొందే ఆనందం.. బరువుగా ఫీలయ్యే బాధ్యతలు.. చెప్పాలంటే జీవితంలో ఇదొక కీలక ప్రయాణం. లక్ష్యం దిశగా పడే తొలి అడుగులకు శ్రీకారం చుట్టేది.. ఫ్యూచర్‌లో వారి లైఫ్ కలర్‌ఫుల్‌గా ఉండబోతుందా లేదా కష్టాల కడలి కానుందా డిసైడ్ అయ్యేది.. ఇక్కడే. నిన్ను అందలం ఎక్కించాలన్న లేదా అధ:పాతాళానికి పడేయాలన్నా ఆ పవర్ యవ్వనంలో తీసుకునే నిర్ణయాలదే. కానీ ప్రజెంట్ జనరేషన్‌కు చెందిన యూత్.. తమ జీవిత లక్ష్యాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉంటున్నారా? లేదా సర్దుబాటు ధోరణికి అలవాటుపడుతున్నారా? అంటే సమాధానం కొంచెం అటు ఇటు గానే వినబడుతోంది. కలలను సాకారం చేసుకునే క్రమంలో కొంతమంది యువత.. పట్టువదలకుండా ప్రయ్నతిస్తుంటే, మరికొందరు తొలి ప్రయత్నాల్లో ఓటమి పలకరిస్తే చాలు.. నిరాశ నిస్పృహలకు గురై, వెనుదిరుగుతున్నారు. ఇక అదృష్టాన్ని నమ్ముకుని కాలం వెళ్లదీసే వారికీ కొదువలేదు. ఈ వైరుధ్యాలపై స్పెషల్ ఫోకస్..
మనం ఇష్టపడి చేయాలే గానీ ఏ రంగంలోనైనా ఓటమి ఉందడనేది నిపుణుల మాట. స్వామి వివేకానంద చెప్పినట్టు.. ‘ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి. క్రమంగా ఘనమైన ఫలితాలు వస్తాయి.. సాహసంగా పని చేయండి. బలం, శక్తి మీలోనే ఉన్నాయని గుర్తుంచుకోండి.. విశ్వాసంతో లేచి నిలబడండి.. ధైర్యంగా బాధ్యతను భుజ స్కంధాలపై వేసుకోండి.. భవిష్యత్తుకు మీరే బాధ్యులని తెలుసుకోండి’. ఈ సూక్తులను బలంగా నమ్మి, ఆచరిస్తే పాజిటివ్ రిజల్ట్స్ తలుపుతట్టడం గ్యారంటీ. ఈ మేరకు చిన్న వయసులోనే అద్భుతాలు సాధిస్తున్నవారు, అత్యున్నత పదవులు అధిరోహిస్తున్నవారు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారనడంలో సందేహం లేదు.
అసంతృప్తితో లైఫ్ జర్నీ..
వీరి సంగతి పక్కనబెడితే నాన్న చెప్పాడనో, అమ్మకు ఇష్టమనో లేక ఫ్రెండ్‌ను ఫాలో అవుదామనో.. ఇంకేదో కారణంతో నచ్చని రంగంలో అడుగుపెట్టి, మొక్కుబడిగా జాబ్ చేస్తూ అసంతృప్తితో లైఫ్ జర్నీని కొనసాగించేవారు ఎందరో. అయితే వీరిని ఎన్ని అసంతృప్తులు వెంటాడినా జీవితంపై స్పష్టమైన అవగాహన ఉండటం ఒక్కటి ప్లస్ పాయింట్. ఎప్పటికో చేస్తున్న రంగంలోనైనా పై స్థాయికి వెళ్లే అవకాశం ఉండొచ్చు. ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండకపోవచ్చు. ఫ్యూచర్‌లో తమ పిల్లలకైనా సెక్యూర్డ్ లైఫ్ ఇవ్వొచ్చు. ఈ సంగతి పక్కనబెడితే చాలామంది యువత అవకాశాల కోసం ఎదురుచూడకుండా, తమకున్న నైపుణ్యాలే పెట్టుబడిగా యూట్యూబ్ చానళ్లు స్టార్ట్ చేస్తున్నారు, చిన్న చిన్న స్టార్టప్ బిజినెస్‌లు ప్రారంభించి రాణిస్తున్నారు. కానీ అసలు ప్రయత్నమే చేయకుండా ‘దేనికైనా టైమ్ రావాలి, అదృష్టం కలిసిరావాలి, దేవుడి కృప ఉండాలి’ అంటూ కాకమ్మ కబుర్లతో కాలం వెళ్లదీసే వారితోనే సమస్య.
‘తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా’
ఓ లక్ష్యం అనేది లేకుండా.. ‘తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా’ అనే టైపులో లైఫ్ లీడ్ చేస్తూ.. బాధ్యతలకు ఆమడ దూరం పరిగెడుతూ.. చెట్టంత ఎదిగినా తల్లిదండ్రులపై ఆధారపడేవారు, జల్సాలకు అలవాటుపడి జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నవారూ కోకొల్లలుగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల అతి గారాబం కూడా ఇందుకు దోహదపడే అవకాశం ఉంది. శ్రీమంతులు అయితే కొన్నాళ్లకు ఏ బిజినెస్ అయినా చూసుకొని సెటిలవ్వొచ్చు. ఎంట్రీలోనే ఎగ్జిట్ ప్లాన్ ఉంటే ఇంకాస్త సేఫ్‌గా ఉండొచ్చు. కానీ, కుటుంబ ఆర్థిక నేపథ్యం అంతంతే ఉంటే మాత్రం జీవితాంతం కష్టాలు ఎదుర్కోక తప్పదు. భవిష్యత్తులో పెళ్లి, పిల్లలపైనా ఆ ప్రభావం పడే చాన్స్ లేకపోలేదు.
యూత్ అంటే పార్టీలేనా..
ఇవన్నీ ఒక ఎత్తయితే.. అసలు లైఫ్ అంటే సీరియస్‌నెస్ లేని ప్రబుద్ధులు, నయా కల్చర్ పేరుతో దారితప్పే యువకులది మరో కథ. అల్లరిచిల్లరగా తిరుగుతూ, ఏదో ఒక అకేషన్ పేరుతో పార్టీల్లో మునిగితేలుతూ, స్థానికంగా ఏదో ఒక రాజకీయ పార్టీ జెండాను మోస్తూ పబ్బం గడుపుకోవడంతోనే వారి జీవితం తెల్లారిపోతోంది. ఈ క్రమంలోనే గ్రూపు రాజకీయాలు, గొడవలు వారికి నిత్య తంతుగా మారిపోతున్నాయి. అవసరం తీరాక వీరిని పక్కనబెట్టడంతో అప్పుడు తత్వం బోధపడుతుంది. కానీ అప్పటికే జీవితం చేయి దాటిపోయే పరిస్థితి నెలకొంటోంది. సొసైటీలో అడుగడుగునా ఇలాంటి సంఘటనలు తారసపడుతూనే ఉన్నాయి.
‘బలమే జీవితం, బలహీనతే మరణం, మన స్థితికి మనమే బాధ్యులం.. లక్ష్యాన్ని సాధించే శక్తి మనలోనే ఉంది’ అన్న నరేంద్రుడి సూక్తుల స్ఫూర్తితో యువత లక్ష్యం వైపు పయనించే క్రమంలో చిన్న చిన్న అవాంతరాలకు ఆగిపోకూడదని, తమ మేధోశక్తితో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిద్దాం.