వెళ్లి ఆయన చెవిలో చెప్పు.. Pawan kalyanపై పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ ఇప్పటంలో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్.. వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. .

Update: 2022-11-27 11:08 GMT

దిశ వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఇప్పటం కూల్చివేతల్లో ఇళ్లు కోల్పోయిన వారికి లక్ష సాయం అందించిన పవన్.. వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత వెనుక సజ్జల పాత్ర ఉందని ఆరోపించారు. దీంతో పేర్ని నాని స్పందించారు. పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసమే తమపై పవన్ విమర్శలు చేశారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. జగన్ పై విద్వేషం తప్ప పవన్ ప్రసంగంలో ఏమీ లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చుతానని పవన్ పదే పదే అంటున్నాడని మండిపడ్డారు. ఇప్పటం ప్రజలు అమరావతి రైతుల్లా పోరాటం చేయలేదంటున్నాడని.. పవన్‌ను నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని చెప్పారు. పవన్ వెళ్లాడని ఇప్పటంలో ఏం ఆగిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో దౌర్జన్యం చేసినప్పుడు గుండెల్లో ఏమీ గుచ్చులేదా అని ప్రశ్నించారు. సజ్జలకు పవన్ బొడ్డు కోసి పేరు పెట్టారా? అని పేర్ని నాని నిలదీశారు. ప్రధానితో భేటీపై పవన్ రోజుకో మాట చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధానితో ఆయన ఏం మాట్లాడితే తమకెందుకన్నారు. మోదీ కాళ్లు పట్టుకునేది.. చంద్రబాబు చంకనెక్కి ప్రధానిని తిట్టేదీ పవనేనని విమర్శించారు. మోదీ పవన్ ఏం మాట్లాడుకున్నారో తెలియక చంద్రబాబు టెన్షన్ పడుతున్నారని.. చెప్పాలనుకుంటే వెళ్లి ఆయన చెవిలో చెప్పుకోవాలని పేర్ని నాని సూచించారు.

ఇదే ఇప్పటంలో బీజేపీని రోడ్ మ్యాప్ అడిగానని చెప్పింది పవనేనని..ఇప్పుడు యుద్ధం చేస్తానంటున్నదీ ఆయనేనని పేర్ని నాని విమర్శించారు. వైసీపీకి 67 సీట్లు వచ్చినప్పుడు నోట్లో వేలు పెట్టుకుని పవన్ చూశాడని..151 సీట్లు వచ్చినప్పుడు కూడా నోట్లో వేలు పెట్టుకుని చూసిందీ పవనేనని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు వచ్చినప్పుడు కూడా పవన్ అలాగే చూస్తాడని పేర్ని నాని జోస్యం చెప్పారు.

 ఇవి కూడా చదవండి :పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా: MP GVL Narasimharao

Tags:    

Similar News