తిరిగొచ్చిన కరోనా..వూహాన్ మొత్తానికి పరీక్షలు
బీజింగ్ : ప్రపంచ దేశాలకు కరోనా వైరస్ అంటే కంటికి కనిపించని శత్రువు. ఆ మహమ్మారి బారిన పడి లక్షల సంఖ్యలో ప్రజలు తమ ప్రాణాలను కోల్పొయారు. ఇప్పటికీ చాలా మంది ఈ ప్రాణాంతక వైరస్‌తో నిత్యం పోరాడుతూనే ఉన్నారు. వాస్తవానికి దీనిని ప్రపంచానికి పరిచయం చేసింది చైనాలోని వుహాన్ నగరం అయితే దాని కంటే ఇతర దేశాలే ఎక్కువగా నష్టపోయాయి. దీని ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఇన్ని రోజులు వుహాన్‌లో కరోనా కేసులు నమోదు కాకపోవడంతో […]
బీజింగ్ : ప్రపంచ దేశాలకు కరోనా వైరస్ అంటే కంటికి కనిపించని శత్రువు. ఆ మహమ్మారి బారిన పడి లక్షల సంఖ్యలో ప్రజలు తమ ప్రాణాలను కోల్పొయారు. ఇప్పటికీ చాలా మంది ఈ ప్రాణాంతక వైరస్‌తో నిత్యం పోరాడుతూనే ఉన్నారు. వాస్తవానికి దీనిని ప్రపంచానికి పరిచయం చేసింది చైనాలోని వుహాన్ నగరం అయితే దాని కంటే ఇతర దేశాలే ఎక్కువగా నష్టపోయాయి. దీని ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఇన్ని రోజులు వుహాన్‌లో కరోనా కేసులు నమోదు కాకపోవడంతో వైరస్ పీడ విరగడయ్యిందని భావించిన చైనా లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసింది.ఆ తొందరపాటు నిర్ణయమే అసలుకు ఎసరు తెస్తుందని ముందుగా ఊహించలేకపోయింది. వెళ్లిపోయిందనుకున్న వైరస్ తిరిగి డ్రాగన్ కంట్రీకి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో చైనాకు కంటి మీద కునుకులేకుండా పోయింది. ఓ వైపు ప్రపంచ దేశాల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలు, ఒత్తిడిని ఎలా జయించాలనే సమయంలోనే మరల వుహాన్‌లో పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో తల పట్టుకుంటోంది. 2019డిసెంబర్‌లో తొలి కరోనా కేసును గుర్తించిన చైనా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.3 నెలల వ్యవధిలోనే వూహాన్‌లో వైరస్‌ను నివారించడంతో పాటు ఇన్నాళ్లూ అమలులో ఉన్న లాక్‌డౌన్ నిబంధనలు కూడా సడలించారు. శవాల దిబ్బగా మారిన వూహాన్‌లో పరిస్థితులు కుదుట పడుతున్నాయని అనుకుంటున్న సమయంలో కరోనా మరోసారి కలకలం సృష్టిస్తోంది. రెండ్రోజుల నుంచి పాజిటివ్ కేసులు బయటపడుతుండటం, వారిలో చాలా మందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్ అని తేలుతుండటంతో వూహాన్ నగర అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని ఒక కోటీ 10 లక్షల మంది జనాభాకు కరోనా పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. 10రోజుల్లోగా అందరికీ పరీక్షలు పూర్తి చేయాలని.. ముందుగా నివాస ప్రాంతాల నుంచి టెస్టులు మొదలు పెట్టాలని చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే చికిత్స ప్రారంభించడానికి ఆస్పత్రులను తిరిగి సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 8న వూహాన్‌లో లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాతే తిరిగి కేసులు నమోదవుతుండటంతో పాక్షికంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.