తెలుగుభాష పరిరక్షణ, పరివ్యాప్తికోసం ఏంచేద్దాం..? తానా ఆధ్వర్యంలో జూమ్(ZOOM)లో చర్చ
తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా చివరి ఆదివారం “నెలనెలా తెలుగువెలుగు” పేరిట నిర్వహిస్తున్న 71వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం ఈ వారం వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి జయంతి (ఆగస్ట్ 29), ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 'తెలుగుభాష పరిరక్షణ, పరివ్యాప్తికోసం ఏంచేద్దాం' అనే అంశం మీద విస్తృతమైన చర్చ జరిగింది
దిశ, వెబ్‌డెస్క్: తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా చివరి ఆదివారం “నెలనెలా తెలుగువెలుగు” పేరిట నిర్వహిస్తున్న 71వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం ఈ వారం వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి జయంతి (ఆగస్ట్ 29), ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 'తెలుగుభాష పరిరక్షణ, పరివ్యాప్తికోసం ఏంచేద్దాం' అనే అంశం మీద విస్తృతమైన చర్చ జరిగింది.ఈ క్రమంలో తానా అధ్యక్షులు శృంగవరపు నిరంజన్ మాట్లాడుతూ.. 'తెలుగుభాషా సంస్కృతుల పరిరక్షణే ధ్యేయంగా తానా సంస్థ గత 50 సంవత్సరాలుగా విశేష కృషి చేస్తోందని, తానా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాల ద్వారా అమెరికాలో వేలాదిమంది పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారని అన్నారు'.
ప్రతి ప్రాథమిక పాఠశాలలో తెలుగును తప్పనిసరి చేయాల్సిందే
తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ .. 'తెలుగును వ్యావహారిక భాషగా మార్చడంలో ఎంతోమంది ఛాందసువాదులను ఒంటిచేత్తో ఎదుర్కొని, ఆ కృషిలో తన సర్వసాన్ని త్యాగంచేసిన ఏకవ్యక్తి సైన్యం, ధీశాలి గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జన్మదినాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. ప్రభుత్వం కనీసం ఈ ఒక్క రోజైనా ప్రస్తుతం మాతృ భాష పరిస్థితి ఎలా ఉందీ, దాన్ని ఉన్నత స్థితిలో ఉంచడానికి తీసుకోవలసిన చర్యల గురించి దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో కనీసం ప్రాథమిక స్థాయి వరకైనా తెలుగును తప్పనిసరి చెయ్యాలని . ప్రభుత్వం, ప్రజలు,సంస్థలు, విద్యాలయాలు సమన్వయంతో పనిచేసి తెలుగుభాషను పరిరక్షించుకోవాలసిన సమయమిదని' డా. ప్రసాద్ తోటకూర అన్నారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలుగువారు సాధించిన జ్ఞానం విజ్ఞానం, అనుభవసారం అంతా తెలుగుభాషలోనే నిక్షిప్తమై ఉందని, ఈ గొప్పసంపదను భావితరాలు అందుకోవాలంటే వారికి మాతృభాష తెలిసి ఉండాలన్నారు.
భాషా వినియోగంతోనే ఆర్ధిక ఆలంబన
ఈ చర్చల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భారతీయ భాషా శాస్త్రజ్ఞుల సంఘం అధ్యక్షులు ఆచార్య డా. గారపాటి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ భాషమీద ఆధారపడి 87% ఉత్పత్తులు, అమ్మకాలు, కొనుగోళ్ళ వ్యవహారాలు జరుగుతున్నాయని, భాషా వినియోగంతోనే ఆర్ధిక ఆలంబన ఉందని, తెలుగు భాషా మాధ్యమం అమలు జరగకపోతే భవిష్యత్తులో భాషా సంక్షోభం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
గిడుగు కృషి అందరికీ ఆదర్శం
చర్చల్లో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య డా. మాడభూషి సంపత్ కుమార్ మాట్లాడూతూ.. కార్పోరేట్ విద్యావిధానం ద్వారా మాతృభాషకు ముప్పు ఏర్పడిందని, మాతృభాషను నిలబెట్టుకోవడానికి ప్రజా ఉద్యమాలు అవసరం అన్నారు.
తెలుగుభాషోధ్యమ నాయకులు డా. సామల రమేష్ బాబు మాట్లాడుతూ పట్టణాలతో పాటు గ్రామాలలో నివసిస్తున్న ప్రజల్లోకి తెలుగు భాషోధ్యమాన్ని తీసుకువెళ్ళడంలో గిడుగు కృషిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
తెలుగుమాధ్యమంలో చదువుకున్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలి
పూర్వ డిప్యూటీ కలెక్టర్ డా. నూర్ భాషా రహంతుల్లా మాట్లాడూతూ .. ప్రాథమికస్థాయిలో తెలుగుమాధ్యమం తప్పనిసరిగా ప్రవేశ పెట్టాలని, న్యాయవ్యవస్థలో తీర్పులు తెలుగులోనే ఉండాలని, తెలుగుమాధ్యమంలో చదువుకున్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలన్నారు.
భాషోద్యమ నాయకులు డా. గుంటుపల్లి శ్రీనివాస్ మాట్లాడాతూ
“వ్యక్తులు, వ్యవస్థల ద్వారానే భాషా పరిరక్షణ సాధ్యమని, తగు జాగ్రత్తలు తీసుకోక పోతే ఉర్దూభాష ఏ విధంగా క్రమ క్రమంగా అంతరించిపోతున్నదో అలాగే తెలుగుభాష కూడా అంతరించిపోయే ప్రమాదం ఉందన్నారు.
మాట్లాడటం, రాయడం కూడా తెలుగులోనే..
‘అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్’ ద్వారా విదేశీయులకు తెలుగు మాట్లాడం, రాయడంలో శిక్షణ ఇస్తున్న ఆచార్య డా. కటికనేని విమల మాట్లాడుతూ ముందుగా భాషాతర్కాన్ని అర్ధం చేసుకోవాలని, కేవలం తెలుగు మాట్లాడమే గాకుండా రాయడం కూడా నేర్చుకోవాలన్నారు.
నిజాం కళాశాల తెలుగు అధ్యాపకులు డా. చంద్రయ్య శివన్నమాట్లాడుతూ.. సామాజిక సమానత్వ విలువగా భాషా పరివ్యాప్తి జరగాలని, విద్యార్థులకు భాషపై పట్టును, వ్యక్తీకరణ సామర్థ్యం పెంపొదించే విధంగా రూపకల్పన జరగాలన్నారు.
తెలుగుభాష మనుగడ కోల్పోయే ప్రమాదం
తెలుగుభాషను సులువుగా నేర్చుకునేందుకు వీలుగా ‘ఈ – బుక్’,‘యాప్స్’,‘ఆన్లైన్ నిఘంటువులు’ లాంటివి రూపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు అంతర్జాల సాంకేతిక నిపుణులుశ్రీ రహమానుద్దీన్ షేక్. “ఈమాట” పత్రిక సంస్థాపక సంపాదకులు, సురేష్ కొలిచాల మాట్లాడుతూ.. తెలుగు భాషను పరిరక్షించుకోవడంలో సరైన ప్రణాళికను అనుసరించకపోతే 22వ శతాబ్దంలో అంతరించబోయే 90% భాషల్లాగే తెలుగుభాష కూడా తన మనుగడను కోల్పోవచ్చని హెచ్చరించారు. భాష మనుగడకు సురేష్ ఆరు సూత్రాలను ప్రతిపాదించారు.
విదేశంలో తెలుగు నేర్చుకుని..
కేవలం 18 నెలల వయస్సులో తన తల్లిదండ్రులతో పాటు కాకినాడ నుండి వచ్చి అమెరికా దేశంలో స్థిరపడ్డ బిందు బచ్చు మాట్లాడూతూ.. తనకు తెలుగుభాష పెద్దగా తెలియకపోయినా, మాతృదేశంలో ఉన్న బంధుమిత్రులతో మాట్లాడడానికి మాతృభాష చాలా అవసరం అని గుర్తించి, వివాహమై, పిల్లలు కల్గిన తర్వాత పట్టుదలతో తెలుగు నేర్చుకున్నానని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలతో తెలుగులోనే మాట్లాడడం ద్వారా ప్రవాసంలో మాతృభాషను నిలుపుకోవచ్చన్నారు.