ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు..మిస్సైల్, డ్రోన్‌లే లక్ష్యం!
ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపనులతో ఇరాక్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌పై ఆంక్షలు విధించనున్నట్టు ప్రకటించింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపనులతో ఇరాక్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌పై ఆంక్షలు విధించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ మీడియాతో మాట్లాడారు. ఇరాన్ ప్రభుత్వం తన ప్రమాదకరమైన చర్యలకు బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవడానికి అమెరికా వెనుకాడబోదని స్పష్టం చేశారు. త్వరలోనే మిసైల్, డ్రోన్ ప్రోగ్రామ్ సహా ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని నూతన ఆంక్షలు విధించబోతున్నట్టు వెల్లడించారు. ఇరాన్ రక్షణ శాఖకు మద్దతిచ్చే సంస్థలు, దాని మిత్ర దేశాలపై కూడా ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తగ్గించడానికి మాత్రమే ఈ ఆంక్షలు ఉండనున్నాయని చెప్పారు.
మరోవైపు ఇరాన్ క్షిపణి కార్యక్రమంపై ఆంక్షలు విధించాలని, ఆ దేశ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ను తీవ్రవాద గ్రూపుగా గుర్తించాలని కోరుతూ 32 దేశాలకు లేఖ రాశానని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు. అలాగే ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ఇప్పటికే తేల్చి చెప్పింది. అయితే దీనికి అమెరికా మద్దతివ్వక పోగా యూఎస్ భాగస్వామ్యం లేకుండానే దాడి చేస్తామని ఐడీఎఫ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం ఇప్పట్లో ముగిసి పోయేలా కనిపించడం లేదు.
కాగా, సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై చేసిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ గత శనివారం దాడి చేసింది.300లకుపైగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. వాటన్నింటినీ ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. అయితే భారీ నష్టం ఏం జరగనప్పటికీ ప్రతిదాడి తప్పదని ఇజ్రాయెల్ చెబుతోంది. వివాదం ముగిసిందని దాడి అనంతరం ఇరాన్ ప్రకటించింది. పౌర లక్ష్యాలపై దాడి చేయలేదని, ఐక్యరాజ్యసమితిలోని అర్టికల్ 50 ప్రకారమే దాడి చేశాయని ఇరాన్ తేల్చి చెప్పింది.