18 కోట్ల మంది పిల్లల్లో పోషకాహార లోపం

ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మందికి పైగా పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని యునిసెఫ్(UNICEF) పేర్కొంది

Update: 2024-06-21 08:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మందికి పైగా పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని యునిసెఫ్(UNICEF) పేర్కొంది. ప్రతి నలుగురు పిల్లల్లో ఒక్కరు తీవ్రమైన ఆహార పేదరికంతో బాధపడుతున్నారని తెలిపింది. చైల్డ్ ఫుడ్ పావర్టీ, న్యూట్రిషన్ డిప్రివేషన్ ఇన్ ఎర్లీ చైల్డ్ హుడ్ అనే పేరుతో యునిసెఫ్ తాజాగా ఒక నివేదికను విడుదల చేయగా దానిలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా నలుగురు పిల్లల్లో ఒకరు రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఆహారాన్ని తీసుకుంటుండగా, కొన్నిసార్లు వారికి అసలు ఆహారం కూడా దొరకడం లేదని, దీంతో దాదాపు 181 మిలియన్ల మంది పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపానికి గురై వారి పెరుగుదల, అభివృద్ధి, మొత్తం శ్రేయస్సుపై తీవ్రమైన ప్రభావం పడుతుందని నివేదిక తెలిపింది.

ముఖ్యంగా దక్షిణాసియా, ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో పిల్లల ఆహార పేదరికం ప్రబలంగా ఉందని నివేదిక హైలైట్ చేసింది. పోషకాహార లోపంతో బాధపడుతున్న మొత్తం 18 కోట్ల మంది పిల్లల్లో 65 శాతం మంది భారతదేశం, గినియా, ఆఫ్ఘనిస్తాన్, బుర్కినా ఫాసో, ఇథియోపియాతో సహా కేవలం 20 దేశాల్లో ఉన్నారని డేటా పేర్కొంది. దక్షిణాసియాలోనే 64 మిలియన్ల మంది పిల్లలు ప్రభావితమయ్యారు. సోమాలియా, గాజా స్ట్రిప్‌లో 63 శాతం మంది పిల్లలు తీవ్రమైన ఆహార పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఇక్కడ పది మంది పిల్లల్లో తొమ్మిది మంది తీవ్రమైన ఆహార పేదరికంలో జీవిస్తున్నారని నివేదిక తెలిపింది. అయితే దీనికి వ్యతిరేకంగా పిల్లల ఆహార పేదరికంలో బెలారస్ అత్యల్ప స్థాయిని కలిగి ఉంది. నివేదిక ప్రకారం, మొత్తం బాధిత పిల్లల్లో 46 శాతం మంది పేద కుటుంబాలలో, 54 శాతం మంది దారిద్రరేఖకు ఎగువన ఆదాయం ఉన్న కుటుంబాలలో ఉన్నారు.

భారత్‌ విషయానికి వస్తే,

పిల్లల ఆహార పేదరికం కారణంగా తీవ్రంగా ప్రభావితమైన మొదటి 25 దేశాలలో భారతదేశం ఒకటి. ఆసియాలో.. ఆఫ్ఘనిస్తాన్, భూటాన్ తర్వాత భారతదేశం మూడవ స్థానంలో ఉంది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న భారతీయ పిల్లలు ఎక్కువగా తీవ్రమైన ఆహార పేదరికంలో జీవిస్తున్నారని నివేదిక వెల్లడించింది. పిల్లల పేదరికాన్ని పరిష్కరించడానికి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పటికీ, సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఆర్థిక అవకాశాలు పరిమిత స్థాయిలో ఉండట వంటి అంశాలు పురోగతికి ఆటంకంగా కొనసాగుతున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య అసమానత సమస్యను ఇది మరింత తీవ్రతరం చేస్తుందని నివేదిక పేర్కొంది.


Similar News