Biden quits presidential race: కమలా హ్యారిస్ ను ఓడించడం సులభం

అమెరికా అధ్యక్షుడు(US President) జో బైడెన్ పై రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ విమర్శలు గుప్పించారు. దేశ చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్‌ నిలిచారని మండిపడ్డారు.

Update: 2024-07-22 04:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు(US President) జో బైడెన్ పై రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ విమర్శలు గుప్పించారు. దేశ చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్‌ నిలిచారని మండిపడ్డారు. డెమొక్రటిక్‌ నామినీగా బైడెన్‌ వైదొలిగిన తర్వాత ఆయన స్పందించారు. కమలా హారిస్‌ (Kamala Harris) అధ్యక్ష అభ్యర్థి అయితే తాను మరింత సులభంగా ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు. సీఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ.. ‘అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి జో బైడెన్ (Joe Biden) తగిన వ్యక్తి కాదు. ఆ హోదాలో పనిచేసే అర్హత ఆయనకు ఏనాడూ లేదు. అతను కేవలం అబద్ధాలు, అసత్యాలతోనే పదవి పొందారు. మీడియా, వైద్యులు సహా చుట్టూ ఉన్న అందరికీ ఆయన అధ్యక్ష హోదాలో ఉండడానికి అర్హుడు కాదని తెలుసు. బైడెన్ పాలన వల్ల మనం భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం.. వాటిని వీలైనంత త్వరగా చక్కదిద్దుదాం’ అని ట్రంప్‌ అన్నారు. బైడెన్‌ కంటే కమలా హ్యారిస్ ను ఓడించడం ఇంకా సులభమని ట్రంప్‌ (Trump) ధీమా వ్యక్తం చేశారు.

కమలాపై జూనియర్ ట్రంప్ విమర్శలు

డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి నామినీగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు (Kamala Harris) బైడెన్‌ మద్దతు పలికారు. ఆమెపై ట్రంప్ కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ నిప్పులు చెరిగారు. బైడెన్‌ కంటే కూడా ఆమెకు మరింత తక్కువ సామర్థ్యం ఉందని విమర్శించారు. ఆమెకు అప్పగించిన సరిహద్దు సమస్యకు ఏమాత్రం పరిష్కారం చూపలేకపోయారని ఆరోపించారు. ఇకపోతే, సొంతపార్టీ నుంచి వ్యతిరేకత రావడంతో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలిగారు.


Similar News