మిడిల్ ఈస్ట్‌లో తగ్గని ఉద్రిక్తతలు.. ఇజ్రాయెల్ స్థావరంపై హిజ్బుల్లా గ్రూప్ దాడి
మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు.
దిశ, నేషనల్ బ్యూరో: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం ఉండగా, తాజాగా ఇరాన్-మద్దతుగల హిజ్బుల్లా గ్రూప్ బుధవారం ఇజ్రాయెల్ స్థావరంపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసినట్లు ప్రకటించింది. అంతకుముందు రోజు ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా గ్రూప్ కమాండర్ ఇస్మాయిల్ యూసెఫ్ బాజ్‌ను చంపింది, అలాగే వైమానిక దాడిలో ఇద్దరు హిజ్బుల్లా సభ్యులు మరణించారు.
ఈ నేపథ్యంలో దీనికి ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్‌కు చెందిన మిలిటరీ 91వ డివిజన్ ప్రధాన కార్యాలయంపై దాడి చేసినట్లు వారు ప్రకటించారు. హిజ్బుల్లా గ్రూప్ దక్షిణ లెబనాన్‌లో ఉంది. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్-హామాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ గ్రూప్ ఇజ్రాయెల్‌తో ఘర్షణ పడుతోంది. ఇది గత ఆరు నెలల కాలంలో 3,200 క్షిపణులను ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించిందని ఒక నివేదిక తెలిపింది. మిడిల్ ఈస్ట్‌లో హిజ్బుల్లా అత్యంత బలమైన గ్రూప్. నివేదికల ప్రకారం, ఇది దాదాపు 150,000 రాకెట్లు, 45,000 యుద్ధ విమానాలను కలిగి ఉంది.