ప్రజలకు ఏనుగు మాంసం పంచిన ప్రభుత్వం.. గగ్గోలు పెట్టిన అంతర్జాతీయ సమాజం

ఆఫ్రికాలోని నమీబియా దేశం తీవ్ర కరువుతో అల్లాడుతోంది.

Update: 2024-08-30 14:40 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆఫ్రికాలోని నమీబియా దేశం తీవ్ర కరువుతో అల్లాడుతోంది. అక్కడి ప్రజలకు తిండి, నీళ్ళు లేక ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో నమీబియా ప్రభుత్వం కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. అక్కడి అడవులలో సంచరించే ఏనుగులను, వన్యప్రాణులను చంపి ఆ మాంసాన్ని ప్రజలకు పంచుతామని ప్రకటించింది. ప్రజల ఆకలి తీర్చేందుకు దాదాపు 800కు పైగా వన్యప్రాణులను ప్రొఫెషనల్ వేటగాళ్లతో చంపిస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే 157 అటవీ జంతువులను వధించి ఆ మాంసాన్ని ప్రజలకు పంచగా... తాజాగా మళ్ళీ ఈ ప్రకటన జారీ చేశారు.

నమీబియాలో తీవ్ర నీటి ఎద్దడి వలన పంటలు పండక, 84% ఆహార నిల్వలు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మరింత దిగజారి, దేశ జనాభాలో సగం మందికి కూడా తిండి దొరక్క పోవచ్చని ప్రభుత్వం అభిప్రాయ పడింది. అయితే ఈ తీవ్ర కరువుకు వన్యప్రాణులు కూడా ఒక కారణం అని అధికారులు చెబుతున్నారు. ఉన్న కొద్ది నీటి వనరులను కూడా అవే తాగుతుండటం వలన కనీసం ప్రజలకు తాగు నీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఆఫ్రికాలోని పలు దేశాల్లో విస్తరించి ఉన్న ఆఫ్రికా అటవీ ప్రాంతంలో 2 లక్షల వరకు ఏనుగులు ఉన్నాయి. ఇక మిగతా వన్యప్రాణులు వేలు, లక్షల్లో ఉన్నాయి. అవసరానికి మించి ఉన్న వన్య ప్రాణులను తగ్గిస్తేనే ఉన్న నీటి వనరులనయినా కాపాడుకోవచ్చని ప్రభుత్వ ఇలాంటి నిర్ణయం తీసుకుంది.

ఆఫ్రికాలో కరువు పరిస్థితుల కారణంగా ఐక్యరాజ్యసమితి నమీబియాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మరోవైపు పలు అభివృద్ది చెందిన దేశాలు వన్యప్రాణులను చంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. తమ దేశ చట్టాలను అనుసరించే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు నమీబియా నాయకులు, అధికారులు చెబుతున్నారు.


Similar News