'ఆంక్షలు రష్యాను మరింత బలోపేతం చేస్తున్నాయి'.. షాంఘై శిఖరాగ్ర సమావేశంలో పుతిన్

ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో తమపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలను వ్యతిరేకిస్తూనే ఉంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.

Update: 2023-07-04 13:35 GMT

మాస్కో: ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో తమపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలను వ్యతిరేకిస్తూనే ఉంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఈ ఆంక్షలు రష్యాను మరింత బలోపేతం చేస్తున్నాయన్నారు. మంగళవారం షాంఘై కో-ఆపరేషన్ (ఎస్ సీవో) సమ్మిట్‌లో పుతిన్ వర్చువల్‌గా ప్రసంగించారు. రష్యాలో గత నెలలో జరిగిన తిరుగుబాటు తర్వాత పుతిన్ పాల్గొన్న తొలి అంతర్జాతీయ సమావేశం ఇది. ఆంక్షలను నీరుగార్చేందుకే ఎస్‌సీవో దేశాలతో స్థానిక కరెన్సీలో లావాదేవీలు నిర్వహిస్తున్నామంటూ తమ చర్యలను పుతిన్ సమర్ధించుకున్నారు.

ఎస్‌సీవో-2023 సమ్మిట్‌ భారత్ నేతృత్వంలో వర్చువల్ విధానంలో జరుగుతోంది. తన ధిక్కార స్వరాన్ని పాశ్చాత్య దేశాలకు వినిపించేందుకు ఈ సమ్మిట్‌ను పుతిన్ వాడుకున్నారు. చైనా, రష్యా ప్రజల మధ్య 80% కంటే ఎక్కువ వాణిజ్యం రూబిల్స్, యువాన్‌లలో జరుగుతోందని, ఎస్‌సీవోకు చెందిన ఇతర దేశాలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని సూచించారు. ఎస్‌సీవోలో వచ్చే ఏడాది శాశ్వత సభ్యత్వం కోసం బెలారస్ చేసిన దరఖాస్తును రష్యా సమర్ధించింది.

వాణిజ్యం, కనెక్టివిటీ, సాంకేతిక సహకారాన్ని పెంచుకోవాలి: మోడీ

వాణిజ్యం, కనెక్టివిటీ, సాంకేతిక సహకారాన్ని మరింత పెంచుకోవాలని ఎస్‌సీవో సభ్య దేశాలకు సమ్మిట్ నిర్వాహక దేశం తరఫున భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. కానీ.. ఉక్రెయిన్‌లో రష్యా దాడి, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ఆధిపత్యాన్ని ఆయన నేరుగా ప్రస్తావించలేదు. పాశ్చాత్య దేశాలతో సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో దౌత్యపరమైన రాయబారాలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే.. చాలా కాలంగా ఘర్షణ వైఖరిని ప్రదర్శిస్తున్న పొరుగు దేశం చైనా గురించి ఆయన ప్రస్తావించలేదు.

సీమాంతర ఉగ్రవాదంపై పోరాటానికి సహకరించాలని సభ్య దేశాలను మోడీ కోరారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాలను విమర్శించేందుకు ఎస్‌సీవో వెనుకాడకూడదంటూ పరోక్షంగా పాకిస్తాన్‌ను మోడీ టార్గెట్ చేశారు. అయితే.. ‘దేశీయ రాజకీయ ఎజెండాల ముసుగు’లో మైనారిటీలను దయ్యంగా చూడకూడదని పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఎదురుదాడి చేశారు.


Similar News