కూలిన కఖోవ్కా ఆనకట్ట.. పోటెత్తిన వ‌ర‌ద‌లు

నోవా కఖోవ్కా.. ఇది దక్షిణ ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమించుకున్న సిటీ.

Update: 2023-06-06 13:30 GMT

మాస్కో : నోవా కఖోవ్కా.. ఇది దక్షిణ ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమించుకున్న సిటీ. ఇప్పుడిది ఆ రెండు దేశాల పరస్పర దాడుల‌కు కేంద్రంగా మారింది. ఈ క్రమంలోనే అక్కడి డ్నిప్రో నదిపై ఉన్న ఆన‌క‌ట్ట కూలిపోవ‌డంతో వ‌ర‌ద‌లు సంభ‌వించాయి. దాదాపు 300 కుటుంబాలను ఇళ్ళు ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నోవా కఖోవ్కాలో రష్యా నియమించిన నగర పరిపాలన అధిపతి వ్లాదిమిర్ లియోంట్యేవ్ రష్యన్ మీడియాకు వెల్లడించారు. డ్నిప్రో నదిపై ఆన‌క‌ట్ట కూలిపోవ‌డంతో వ‌ర‌ద పోటెత్తిన దృశ్యాల‌ను రష్యన్ న్యూస్ చానళ్ళు ప్రసారం చేశాయి. వరదల ఉధృతికి నోవా కఖోవ్కా సిటీ సెంట్రల్ స్క్వేర్ పూర్తిగా నిండిపోయింది. నోవా కఖోవ్కా సమీపంలోని రెండు జనావాసాల నుంచి 53 బస్సుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

రెస్క్యూ సిబ్బంది, నగర పాలక సంస్థ సిబ్బంది, సైనికులు స‌హాయ‌క చ‌ర్యలు చేపడుతున్నారు. మరోవైపు దీనిపై ఉక్రెయిన్ అధికారి, ప్రాంతీయ గవర్నర్ ఒలెక్సాండర్ ప్రోకుడిన్ కూడా ప్రకటన విడుదల చేశారు. మరో ఐదు గంటల్లో వరద ఉధృతి ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని తన టెలిగ్రామ్ ఛానెల్ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. అయితే రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియా ద్వీపకల్పానికి నీటి సరఫరాను నిలిపివేయాలనే దురుద్దేశంతోనే ఈ ఆనకట్టను ఉక్రెయిన్ మద్దతుదారులు ధ్వంసం చేసి ఉండొచ్చని ర‌ష్యన్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ వాద‌న‌ను ఉక్రెయిన్ ఖండించింది. ర‌ష్యా సైన్యాలే ఆన‌క‌ట్ట‌ను కూల్చివేశాయ‌ని మండిప‌డింది.

ర‌ష్యా ఉగ్రవాదుల ప‌నే ఇది : జెలెన్ స్కీ

"రష్యా ఉగ్రవాదులే నోవా కఖోవ్కా జలవిద్యుత్ కేంద్రం ఆనకట్టను ధ్వంసం చేశారు. నీరు, క్షిపణులు లేదా ఏ దాడితోనూ వాళ్ళు ఉక్రెయిన్‌ను ఆపలేరు. ఉక్రెయిన్‌లో ఎక్కడున్నా వాళ్ళను తరిమికొడతాం. అందుకు ఉన్న ఏ ఒక్క అవ‌కాశాన్ని కూడా వదిలిపెట్టం. ఎందుకంటే రష్యన్లు ప్రతి మీటరును ఉగ్రవాదానికి ఉపయోగిస్తారు. ఉక్రెయిన్ విజయం మాత్రమే ఉక్రెయిన్ ప్రజల భద్రతను పునరుద్ధరిస్తుంది" అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు.

Tags:    

Similar News