North Korea: యురేనియం శుద్ధి కేంద్రం ఫొటోలను తొలి సారిగా విడుదల చేసిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియా(North Korea) తన అణ్వాయుధాల తయారీలో కీలక భాగమైన యురేనియం(Uranium) శుద్ధి కేంద్రం ఫొటోలను మొదటిసారిగా విడుదల చేసింది.

Update: 2024-09-13 20:35 GMT

దిశ, వెబ్‌డెస్క్:ఉత్తర కొరియా(North Korea) తన అణ్వాయుధాల తయారీలో కీలక భాగమైన యురేనియం(Uranium) శుద్ధి కేంద్రం ఫొటోలను మొదటిసారిగా విడుదల చేసింది.ఈ ఫోటోలలో ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) కూడా ఉన్నారు.కాగా దేశ అణుసంపత్తిని భారీ స్థాయిలో పెంచుతామని కిమ్ జోంగ్ ఉన్ గతంలోనే ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఉత్తర కొరియా విడుదల చేసిన ఫోటోలను చూస్తే అర్థమవుతోంది.కాగా ఉత్తర కొరియా ప్రధాన అణు ఉత్పత్తి కేంద్రం యోంగ్‌బ్యోన్‌(Yongbyon)లో ఉంది. అయితే కిమ్ జోంగ్ సందర్శించిన ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలో ఉందా లేదా అనేది వెల్లడించలేదు.

అయితే యురేనియం ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని అధికారులకు కిమ్ గత శుక్రవారం ఆదేశాలు జారీ చేశారని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ( KCNA) ఒక కథనంలో పేర్కొంది.ఇదిలా ఉంటే.. ఉత్తర కొరియా అణ్వాయుధ సంపత్తిని పెంచుకోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రకటించింది.కొరియా ద్వీపకల్పంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితులలో ఉత్తర కొరియా ఈ ఫొటోలను విడుదల చేయడం దక్షిణ కొరియా మిత్రదేశాలపై ఒత్తిడి తెచ్చే మార్గమని నిపుణులు భావిస్తున్నారు. 


Similar News