పిల్లలను కనడం చుట్టే రాజకీయాలు.. కానీ మహిళ కేవలం అందుకే పనికొస్తుందా?
మహిళలు ఏం చేయాలని కోరుకుంటున్నారో నిర్ణయించుకునే స్వేచ్ఛ వారి ప్రాథమిక హక్కు. దాన్ని చిన్నచూపు చూడకూడదు. కానీ గ్లోబల్ లీడర్స్ అదే పనిలో ఉంటున్నారు. పిల్లలను కనమని ఫోర్స్ చేస్తున్నారు. నిజానికి మహిళల మాతృత్వం రాజకీయం అయిపోయింది. లింగ పాత్రలను నిర్ణయించేందుకు, నిర్వచించేందుకు ఒక సాధనంగా మారింది.
దిశ, ఫీచర్స్ : మహిళలు ఏం చేయాలని కోరుకుంటున్నారో నిర్ణయించుకునే స్వేచ్ఛ వారి ప్రాథమిక హక్కు. దాన్ని చిన్నచూపు చూడకూడదు. కానీ గ్లోబల్ లీడర్స్ అదే పనిలో ఉంటున్నారు. పిల్లలను కనమని ఫోర్స్ చేస్తున్నారు. నిజానికి మహిళల మాతృత్వం రాజకీయం అయిపోయింది. లింగ పాత్రలను నిర్ణయించేందుకు, నిర్వచించేందుకు ఒక సాధనంగా మారింది. స్త్రీల అవకాశాలను పరిమితం చేస్తుంది. విభిన్న మార్గాలను అనుసరించేవారి స్వేచ్ఛను లాక్ చేస్తుంది. ప్రస్తుతం ఎంతో కొంత ఉన్న పురోగమనం కాస్త తిరోగమనానికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది.
కనడం చుట్టే ప్రపంచ పాలిటిక్స్...
సంతానోత్పత్తి, అబార్షన్ రైట్స్ యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ డిబేట్ లో హాట్ టాపిక్ గా మారాయి. రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ కాండిడేట్ జేడీ వ్యాన్స్.. పిల్లలను కనకపోతే మహిళలను నిందించే గ్రూప్ లో చేరిన తాజా రాజకీయ నాయకుడు. కాగా పెళ్లి చేసుకోకపోవడం, మాతృత్వానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం విషయంలో విమర్శించాడు. ఇలాంటి వారు సోషియోపాతిక్ గా మారుతారని ప్రకటించాడు. అంటే విలువలు లేని, ఇతరులను అర్థం చేసుకోలేని, గౌరవించని.. సమాజం యాక్సెప్ట్ చేయలేని మెంటల్ కండిషన్ లో ఉంటారని అర్థం. కాగా పిల్లలను కనకపోతే మహిళలు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటారా? అనేది ఇక్కడ అసలు ప్రశ్న.
పాపులేషన్ మ్యాటర్స్ ప్రకారం.. ప్రొనాటలిస్ట్ నాయకులచే నిర్వహించబడుతున్న దేశాలు
1970లలో 10% ఉండగా ఇప్పుడు 30%గా ఉన్నాయి. డిసెంబర్ 2023లో ఇటాలియన్ సెనేటర్ లావినియా మెన్నూని మహిళల స్వయంప్రతిపత్తిపై చేసిన కామెంట్స్ తీవ్రమైన చర్చకు దారితీశాయి. యువతుల ఫస్ట్ ఆస్పిరేషన్ తల్లి కావడమే అని..సాంప్రదాయ కుటుంబ నమూనాగా ఉండాలని ప్రకటించింది. ఈ ఘటన ఒక్కటే కాదు చాలా మంది లీడర్లు స్త్రీల పాత్ర సింగిల్ రోల్.. అదీ పిల్లలను కనడం అనే చెప్తూ వస్తున్నారు.
ఈ మధ్య ప్యోంగ్యాంగ్‌లో జరిగిన మీటింగ్ లో ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ దేశంలో తగ్గుతున్న జననాల రేటుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ విషయంపై పిలుపునిచ్చాడు. పెద్ద పెద్ద కుటుంబాలని ఏర్పరచాలని... ఇందుకోసం ఆఫీసు బ్రేక్ టైమ్స్ లో కూడా శృంగారంలో పాల్గొనాలని సూచించాడు. సింగపూర్ మాజీ ప్రధాని లీ హ్సీన్ లూంగ్ ఎక్కువ మంది పిల్లలను పుట్టించమని మహిళలకు సలహా ఇచ్చిన మరొక నాయకుడు.
మూలకారణం ఇదేనా?
అయితే ఈ అభ్యర్థనలు ఓ క్లిష్టమైన ప్రశ్నను రేకెత్తిస్తున్నాయి. తగ్గుతున్న జనాభాకు గల మూల కారణాలను పరిష్కరించడం మానేసి నాయకులు ప్రసవాల గురించి మాట్లాడుతున్నారు ఎందుకని? పవర్ కారిడార్స్ అమ్మాయిల ఆకాంక్షలను నియత్రించే విధంగా, ప్రాచీన భావాలను బలోపేతం చేసే మాదిరిగానే ఎందుకు ఉండాలి? జనాభా క్షీణత సవాళ్లను ఎదుర్కోవడం అనేది సంప్రదాయాలను రక్షించడం అనే ముసుగులోనే ఎందుకు ఉంటుంది? పురోగతి, జ్ఞానోదయం ఉన్న ఈరోజుల్లో కూడా తాము చెప్పినట్లుగా నడుచుకోవాలని నాయకులు ఎలా కోరుకుంటున్నారు? పితృస్వామ్య భావజాలాన్ని మళ్లీ ముందుకు తెచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మహిళ జస్ట్ బిడ్డను ప్రొడ్యూస్ చేసేందుకే సరిపోతుందా? వారి దుస్థితి గురించి ఎందుకు మాట్లాడటం లేదు?
అంతర్లీన సమస్యలు
ఉత్తర కొరియాలో లక్షలాది మంది సాధారణ మహిళలు అసమాన, డిమాండ్ వ్యవస్థను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ స్త్రీలకు హక్కుల కంటే బాధ్యతలు ఎక్కువ.. లైంగిక, లింగ-ఆధారిత హింసతో సహా మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కువైపోయింది. ఇక రష్యా విషయానికి వస్తే ఉక్రెయిన్ తో యుద్ధం జనాభాను మరింత ఒత్తిడికి గురిచేసింది. మరణాలు 300000 దాటాయి. తీవ్రమైన శ్రామిక శక్తి కొరత, ఆర్థిక మందగమనం ఏర్పడింది. అందుకే ఒక్కో మహిళ ఎనిమిది మందిని కనాలని పిలుపునిచ్చాడు అధ్యక్షుడు. కానీ స్త్రీలు వార్ కు పంపించిన తమ భర్తలు, కొడుకులు, అన్నాదమ్ములను తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తే మాత్రం రెస్పాన్స్ రాకపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది.
ప్రపంచ నాయకులు జనాభా క్షీణతను పరిష్కరించడానికి ప్రసవాల రేటు పెరగాలని వాదిస్తున్నప్పటికీ.. ఇటలీ, ఉత్తర కొరియా, రష్యాలో మహిళలు ఎదుర్కొంటున్న అంతర్లీన సమస్యలు పరిష్కరించబడలేదు. నిశ్శబ్ద పోరాటాలు, అసమాన సామాజిక నిర్మాణాలు, దీర్ఘకాలిక సంఘర్షణలు.. జనన రేటును పెంచడంపై ప్రశ్నలను లేవనెత్తుతుంది. సంఖ్యలపై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తున్నారు కానీ.. ఈ దేశాల్లోని మహిళల బలం, త్యాగం, నిశ్శబ్ద ప్రతిఘటన గురించి చెప్పలేని కథలను విస్మరించకుండా ఉండటం కూడా చాలా ముఖ్యమని విశ్లేషకుల అభిప్రాయం. పిల్లలను కనాలన్న స్త్రీలకు కనీసం వర్క్ ప్లేస్ లో సపోర్ట్ అయినా లభిస్తుందా? ఆఫీసులో శృంగారానికి ఓకే చెప్తున్న ఇవే ప్రభుత్వాలు.. ఆఫీసులో పిల్లలను పెంచేందుకు అనుమతిస్తాయా? లేదంటే ఇంటికే పరిమితం కమ్మని బేబీ ప్రొడ్యూసింగ్ మిషన్ గానే పరిగణిస్తాయా?