Childlessness : కల నెరవేరేనా..? జంటల్లో పెరగుతున్న సంతానలేమి సమస్యలు

Childlessness : కల నెరవేరేనా..? జంటల్లో పెరగుతున్న సంతానలేమి సమస్యలు

Update: 2024-11-28 14:11 GMT

దిశ, ఫీచర్స్ : ‘మాకు ఇద్దరుంటే బాగుంటుంది.. కనీసం ఒక్కరైనా కావాలి?’’ సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్న జంటల నోటి నుంచి ఇటీవల తరచుగా వినిపిస్తున్న మాటలివి. నిజానికి ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి ఒక మధురానుభూతి. అనిర్వచనీయ ఆనందం. కానీ ఆ తర్వాతే.. కొన్నాళ్లకు.. ఓ పాపో, బాబో పుట్టకపోతే.. ఆ ఆనందం ఆవిరైనంత ఇదిగా ఫీలవుతుంటారు కొందరు. ప్రస్తుతం భారత దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది జంటల పరిస్థితి ఇదేనని నివేదికలు సైతం పేర్కొంటున్నాయి. కారణాలేమైనా ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు వంధ్యత్వం (infertility) పెరుగుతోంది. రీ ప్రొడక్టివ్ హెల్త్ ఇష్యూస్‌తో సంతానాన్ని పొందాలన్న తమ కల నెరవేరడం లేదని ఎన్నో జంటలు ఆందోళన చెందుతున్నాయి.

గణాంకాలు ఏం చెబుతున్నాయ్ ..?

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ - 2024 గణాంకాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఆరుగురిలో ఒకరు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. 19 శాతం మహిళలు పెళ్లైన ఏడాది తర్వాత గర్భం దాల్చలేకపోతున్నారు. మరో 10 శాతం మంది పెళ్లైన రెండేళ్ల తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 40 శాతం మంది ఇతరుల ద్వారా సానుభూతి పొందుతుండగా, 36 శాతం మంది మాత్రం తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి కూడా అవహేళనలు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. దీంతో మానసిక ఆందోళన, ఒత్తిడిని అనుభవిస్తున్నారు. మరో 78 శాతం మంది నిస్సహాయ భావాలతో పోరాడుతుండగా, 49 శాతం మంది తమకు సంతానం లేదనే కారణంతో సమాజం చిన్న చూపు చూస్తుందని భయపడుతున్నారు.

హార్మోనల్ ఇంబ్యాలెన్స్

ప్రస్తుతం స్త్రీ, పురుషుల్లో ఇన్‌ఫెర్టిలిటీ ఇష్యూస్ పెరిగేందుకు అనేక కారణాలున్నాయి. శారీరక పరమైన లోపాలు, మానసిక ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, పర్యావరణ పరిస్థితులు అందులో భాగమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా మానసిక ఒత్తిడి జంటల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. క్రమంగా ఇది శారీరక ఆరోగ్యాంపై కూడా ఎఫెక్ట్ చూపడంవల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్‌కు దారితీసి సంతానలేమికి కారణం అవుతోందని నిపుణులు చెబుతున్నారు. అలాగే తమకు ఇంకా సంతానం కలుగులేదన్న ఆలోచనతో జంటలు ఆందోళన చెందడం వల్ల ఫోలికల్ - స్టిమ్యులేటింగ్ హార్మోన్, లూటినైజింగ్, కార్టిసాల్ వంటి హార్మోన్లు బ్యాలెన్స్ తప్పుతున్నాయని, ఇవి రీ ప్రొడక్టివ్ హెల్త్‌పై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఒత్తిడి మూలంగా రిలీజ్ అయ్యే కార్టిసాల్ హార్మోన్ సంతానోత్పత్తికి అవసరమైన ఈస్ట్రోజెన్ అండ్ ప్రొజెస్టెరాన్ వంటి సెక్స్ హార్మోన్ల ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తున్నాయి. ఫలితంగా మహిళల్లో ఇర్రెగ్యులర్ మెన్‌స్ట్రువల్ సైకిల్, అలాగే అండాలు రిలీజ్ కాకపోవడం వంటి వంధ్యత్వ సమస్యలకు దారితీస్తోంది.

మెన్‌స్ట్రువల్ సైకిల్, స్పెర్మ్ క్వాలిటీపై ప్రభావం

దీర్ఘకాలిక ఒత్తిడి విషయానికి వస్తే ఇది మహిళల్లో ఇర్రెగ్యులర్ లేదా అబ్సెంట్ మెన్‌స్ట్రువల్ సైకిల్స్‌కు కారణం అవుతోంది. ఈ పరిస్థితినే హైపోథాలమిక్ అమెనోరియా అంటారు. రీ ప్రొడక్టివ్ హార్మోన్లను నియంత్రించే హైపోథాలమిక్ వాస్తవానికి క్రానిక్ స్ట్రెస్ కారణంగా సంతానానికి అవసరం అయ్యే హార్మోన్లను టెంపరీరీగా ‘షట్ డౌన్’ అయ్యేలా ప్రేరేపిస్తుంది. ఇది మహిళల రుతు చక్రంలో అంతరాయాలకు, పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ లేదా క్వాలిటీ తగ్గడానికి దారితీస్తుంది. అంతేకాకుండా అధిక ఒత్తిడి కారణంగా స్పెర్మ్ మొబిలిటీ, స్ట్రక్చువల్ అబ్‌నార్మాలిటీస్ కూడా తగ్గుతాయి. ఎలివేటెడ్ స్ట్రెస్ వల్ల అంగ స్తంభన సమస్యలు ఏర్పడతాయి. ఇవన్నీ లైంగిక కోరికలను తగ్గించడం ద్వారా కూడా సంతానలేమికి కారణం అవుతుంటాయని నిపుణులు చెబుతున్నారు.

పరిష్కారం ఏమిటి?

మానసిక ఒత్తిడి రీ ప్రొడక్టివ్ హెల్త్‌పై నెగెటివ్ ఇంపాక్ట్ చూపకూడదంటే.. ముందుగా దానిని ఎదుర్కోవాలి. అందుకే సంతానం కోరుకునే జంటలు స్ట్రెస్ మేనేజ్ మెంట్ గురించి కూడా తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. అలాగే తమ నియంత్రణలో లేని అంశాలను అర్థం చేసుకోవడం ద్వారా ఎమోషనల్ బర్డన్స్ తగ్గుతాయి. ధూమపానం, మద్యపానం, నిద్రలేమి, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు వంటివి సంతానలేమి సమస్యలను పెంచుతాయి. ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్ జంక్ ఫుడ్స్ అధికంగా తినడం హార్మోన్ల అసమతుల్యతకు, ఆక్సీకరణ ఒత్తిడికి దారితీయవచ్చు. హై షుగరింగ్ ఫుడ్స్, శుద్ధి చేసిన పిండి పదార్థాలు కూడా హార్మోన్లు, అండోత్సర్గ సమస్యలకు దారితీస్తాయి. ఇవన్నీ జీవన శైలిలో భాగమై ఒత్తిడి, ఆందోళనలతోపాటు రీ ప్రొడక్టివ్ హెల్త్‌పై ప్రతికూల ప్రభావం చూపడంవల్ల సంతానలేమికి కారణం అవుతున్నాయి. కాబట్టి పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఆహారాలను తీసుకోవాలి. రెగ్యులర్‌గా వ్యాయామాలు, యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి. హెల్తీ లైఫ్ స్టైల్ అవర్చుకోవడంతోపాటు సంతానలేమిని ఎదుర్కొంటుంటే వైద్య నిపుణుల సలహాలను తప్పక పాటించాలి. 

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు. 

Read More...

Holiday Heart Syndrome : కొందరికి సెలవు రోజుల్లోనే తలెత్తుతున్న హార్ట్ ప్రాబ్లమ్స్.. కారణం ఇదే





Tags:    

Similar News