హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా

ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. బుధవారం తన తూర్పు తీరంలో హైపర్‌సోనిక్ క్షిపణిని పరీక్షించినట్లు దక్షిణకొరియా సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది

Update: 2024-06-26 10:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. బుధవారం తన తూర్పు తీరంలో హైపర్‌సోనిక్ క్షిపణిని పరీక్షించినట్లు దక్షిణకొరియా సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే అది గాలిలో పేలిపోయిందని పేర్కొంది. ఈ క్షిపణిని రాజధాని ప్యోంగ్యాంగ్ దగ్గర నుంచి ప్రయోగించినట్లు దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. దీనిపై జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ, ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి దాదాపు 100 కి.మీ (62 మైళ్లు) ఎత్తుకు, 200 కి.మీ కంటే ఎక్కువ పరిధి వరకు ప్రయాణించిందని తెలిపింది. ఈ ప్రయోగం తరువాత దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ సీనియర్ అధికారులు ఫోన్ కాల్‌లో మాట్లాడుకున్నారు. ఈ ప్రయోగం UN భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించిందని, అక్కడి ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి తీవ్రమైన ముప్పు అని ఖండించారు.

అమెరికా ఉన్నతాధికారులు మాట్లాడుతూ, ఈ సంఘటన మా సిబ్బందికి, లేదా భూభాగానికి లేదా మా మిత్రదేశాలకు తక్షణ ముప్పు కలిగించదని మేము అంచనా వేసినప్పటికీ, మేము పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉన్నామని ఒక ప్రకటనలో తెలిపారు. గతకొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న ఉత్తరకొరియా తాజాగా హైపర్‌సోనిక్ క్షిపణిని పరీక్షించింది. ఇంతకుముందు ఉత్తర కొరియా చివరి క్షిపణి ప్రయోగం మే 30న జరిగింది.

ఇటీవల దక్షిణ కొరియా, జపాన్‌లతో సంయుక్త కసరత్తులకు US విమాన వాహక నౌకను మోహరించడాన్ని విమర్శించిన ఉత్తర కొరియా ఈ కవ్వింపు చర్యలకు దిగడం గమనార్హం. మరోవైపు గత వారం, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమ్మిట్ నిర్వహించి పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీనిని దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ దేశాలు తీవ్రంగా విమర్శించాయి.


Similar News