Israel-Yemen War: ఇజ్రాయెల్ ను తక్కువ అంచనా వేసేవారికి ఇదే వార్నింగ్..!

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) హౌతీలకు వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ శక్తి సామర్థ్యాలపై అనుమానం ఉన్నవారిని హెచ్చరించారు.

Update: 2024-07-21 08:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) హౌతీలకు వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ శక్తి సామర్థ్యాలపై అనుమానం ఉన్నవారిని హెచ్చరించారు. ఇజ్రాయెల్ ను తక్కువగా అంచనా వేయొద్దని అన్నారు. ‘‘ఇజ్రాయెల్ (Israel) శత్రువులకు నేనో విషయం చెప్పాలి. ఇజ్రాయెల్ తనను తాను కాపాడుకోగలదా లేదా అనే విషయంలో సందేహం లేదు. మాకు హాని తలపెట్టాలనుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది” అని నెతన్యాహు అన్నారు. హొదైదా(Hodeida) పోర్టు ద్వారా ఇరాన్‌ నుంచి హూతీలకు ఆయుధాలు సరఫరా అవుతున్నాయని ఆరోపించారు. వాటి ద్వారానే దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. హూతీలు గత ఎనిమిది నెలలుగా ఇజ్రాయెల్‌పైకి వందలాది మిసైల్స్, డ్రోన్లను పంపారని.. వాటిని అడ్డుకోవడం వల్లే ప్రాణనష్టం జరగలేదన్నారు. హూతీ దాడులను తిప్పికొట్టడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

హౌతీలే లక్ష్యంగా తొలిసారి దాడి

పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమయ్యాక యెమెన్‌లోని హౌతీలే(Houthis) లక్ష్యంగా ఇజ్రాయెల్‌ నేరుగా దాడి చేయడం ఇదే మొదటిసారి. అల్‌-హొదైదా సిటీలోని పోర్టు, చమురు నిల్వ కేంద్రం, విద్యుత్తు కేంద్రంపై శనివారం ఎయిర్ స్ట్రయిక్స్ చేసింది. శుక్రవారం టెల్‌ అవీవ్‌పై హూతీలు డ్రోన్ దాడి చేశారు. దీనికి ప్రతీకారంగానే వైమానిక దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇకపోతే, గాజాలోని(Gaza) ప్రజలకు తాము మద్దతు ఇవ్వకుండా అడ్డుకోవడానికే ఇజ్రాయెల్‌ ఈ దాడులు చేసిందని హూతీల అధికార ప్రతినిధి అబ్దుల్‌ సలాం ఎక్స్‌లో పేర్కొన్నారు.


Similar News