భూమి కంటే చంద్రుడిపైనే కాలచక్రం స్పీడ్ : నాసా

దిశ, నేషనల్ బ్యూరో : భూమితో పోలిస్తే చంద్రుడిపై కాలచక్రం వేగంగా తిరుగుతోందని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు.

Update: 2024-07-12 15:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో : భూమితో పోలిస్తే చంద్రుడిపై కాలచక్రం వేగంగా తిరుగుతోందని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి కంటే చంద్రుడిపై రోజుకు సగటున 57.50 మైక్రో సెకన్ల మేర టైం వేగంగా తిరుగుతోందని వెల్లడించారు. మైక్రో సెకను అంటే ఒక సెకనులో 10 లక్షల వంతుకు సమానం. అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్న నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీకి చెందిన భౌతిక శాస్త్రవేత్తల బృందం అధ్యయనంలో ఈవివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సమాచారంతో కూడిన అధ్యయన నివేదిక తాజాగా కార్నెల్ యూనివర్సిటీకి చెందిన arXiv ప్రీప్రింట్ సర్వర్‌లో పబ్లిష్ అయింది.

‘‘చంద్రుడిపై కాల గతికి, భూమిపై కాల గతికి మధ్యనున్న తేడాను స్పష్టంగా గుర్తించడం చాలా ముఖ్యం. ఈ అంశాలపై స్పష్టత వస్తే భవిష్యత్తులో మరింత కచ్చితత్వంతో చంద్రయాత్రలను నిర్వహించేందుకు మార్గం సుగమం అవుతుంది. చంద్రుడిపై దిగే ల్యాండర్, చంద్రుడిపై తిరిగే రోవర్, చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే ఆర్బిటర్‌ల రెస్పాన్స్ టైంపై భూమిపైనున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉండే శాస్త్రవేత్తలకు ఫుల్ క్లారిటీ వస్తే చాలా మంచిది. ల్యాండర్, రోవర్, ఆర్బిటర్‌ల ట్రాకింగ్ మరింత ఈజీ అవుతుంది’’ అని ఈ నివేదికలో నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.


Similar News