Mumbai rain: కెనడా ప్రధాని ట్రూడోకు ఊరట.. వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఊరట లభించింది. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయింది.

Update: 2024-09-26 04:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఊరట లభించింది. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. ముందస్తు ఎన్నికలను డిమాండ్ చేస్తూ.. కన్జర్వేటివ్ పార్టీ అవిశ్వాస తీర్మానం తీసుకురాగా లిబరల్ పార్టీకి అనుకూలంగా 211 మంది ఓటేశారు. మరో 120 మంది ప్రతిపక్షానికి మద్దతిచ్చారు. దీంతో ట్రూడో అవిశ్వాస తీర్మానంలో నెగ్గారు. 338 సభ్యులున్న కెనడియన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రస్తుతం లిబరల్స్‌కు 154 సీట్లు ఉండగా.. కన్జర్వేటివ్‌ పార్టీకి 119, ఎన్డీపీకి 24, బ్లాక్ క్యూబోకోయిస్ పార్టీకి 34 మంది సభ్యులు ఉన్నారు. నో కాన్ఫిడెన్స్ మోషనల్‌లో విజయం సాధించిన అనంతరం ప్రభుత్వ వ్యవహారాల ఇన్ చార్జ్ కరీనా గౌల్డ్ మాట్లాడుతూ..‘దేశానికి మంచి రోజు. ఎందుకంటే కెనడియన్లు ఎన్నికలను కోరుకుంటున్నారని నేను భావించడం లేదు’ అని తెలిపారు.

అవిశ్వాసం నుంచి ట్రూడో తప్పించుకున్నప్పటికీ, ఆయన ముందున్న మార్గం అంత సులువుగా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షమైన కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మళ్లీ ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేసింది. అలాగే వేర్పాటువాద బ్లాక్ క్యూబెకోయిస్ పార్టీ నేత మాట్లాడుతూ తమ డిమాండ్లను త్వరగా అంగీకరించకపోతే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కృషి చేస్తానని చెప్పారు. దీంతో ట్రూడో రాబోయే రోజుల్లో మరిన్ని సవాళ్లను ఎదుర్కోక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, 2015 నవంబర్ లో తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ట్రూడో.. దేశంలో పెరుగుతున్న ధరలు, గృహ సంక్షోభం వంటి పరిస్థితుల కారణంగా ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. దీంతో ఆయన పార్టీ ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల్లో పరాజయం పాలైంది. అయితే ఇటీవల వెల్లడైన పలు సర్వేల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే లిబరల్ పార్టీ ఓడిపోతుందని వెల్లడైంది. దీంతో ముందస్తు ఎన్నికలు జరపాలని ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేస్తోంది. 


Similar News