Israel-Hamas: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 29 మంది మృతి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య భీకరపోరు జరుగుతోంది. ఇజ్రాయెల్ వరుస దాడుల్లో పాలస్తీనా పౌరుల చనిపోతున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య భీకరపోరు జరుగుతోంది. ఇజ్రాయెల్ వరుస దాడుల్లో పాలస్తీనా పౌరుల చనిపోతున్నారు. శనివారం రాత్రి గాజాలోని జబాలియా ప్రాంతంలోని శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 29 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇక, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో పలువురు శిథిలాల కింద చిక్కుక్కున్నట్లు అధికారులు వెల్లడించారు. గత వారం రోజులుగా జబాలియా ప్రాంతంలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో 150 మంది మృతి చెందినట్లు గాజా అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ దాడులు జరుపుతుండటంతో ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు వెళ్లకుండా గాజాలోని హమాస్ అంతర్గత మంత్రిత్వశాఖ హెచ్చరికలు జారీ చేసింది. సురక్షితమనుకున్న ప్రాంతాల్లోనే దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ సైన్యం తమ పౌర ప్రాంతాలను స్థావరాలుగా ఉపయోగించడాన్ని హమాస్ ఖండించింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 42 వేల పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
ఐక్యరాజ్యసమితి ఆందోళన
ఇకపోతే, గాజాలో సురక్షిత ప్రాంతాలు లేవని ఐక్యరాజ్యసమితి అధికారులు కూడా చెబుతున్నారు. ఉత్తర గాజాలో తీవ్రమైన ఆహారం, ఇంధనం, వైద్య సామాగ్రి కొరతపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో కరువు వచ్చే ప్రమాదం కూడా ఉందన్నారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల ఉత్తరగాజాలో వచ్చే వారం ప్రారంభం కానున్న పోలియో టీకా క్యాంపెయిన్ ప్రభావితం కానున్నట్లు ఐక్యరాజ్యసమితి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ గాజా స్ట్రిప్ ప్రాంతాల్లో సోమవారం నుండి పోలియో క్యాంపెయిన్ ప్రారంభం అవుతుందని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు మూడ్రోజులు పడుతుందంది. ఇకపోతే, ఆగస్టులో టైప్ 2 పోలియో వల్ల శిశువు పాక్షికంగా పక్షవాతానికి గురైంది. గత 25 ఏళ్లలో అక్కడ అదే తొలి కేసు. దీంతో గత నెలలోనే పోలియో టీకాలు ప్రారంభించారు.