'వెస్ట్‌బ్యాంక్‌పై అతి పెద్ద సైనిక చర్య'.. పాలస్తీనాపై 20 ఏళ్లలో ఇజ్రాయిల్ భారీ దాడి

ఇజ్రాయిల్ సైనిక దళాలు ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌పై భారీ దాడి నిర్వహించింది.

Update: 2023-07-04 13:51 GMT

టెల్ అవీవ్: ఇజ్రాయిల్ సైనిక దళాలు ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌పై భారీ దాడి నిర్వహించింది. డ్రోన్లు, విమానాలతో వందలాది మంది ఇజ్రాయిల్ సైనికులు నిర్వహించిన అతిపెద్ద ఆపరేషన్‌లో 8 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. 20 ఏళ్లలో చేపట్టిన అతిపెద్ద సైనిక చర్యను ‘విస్తృతమైన ఉగ్రవాద నిరోధక ప్రయత్నం’గా ఇజ్రాయిల్ ప్రభుత్వం ప్రకటించింది. జెనిన్ నగరాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. వెస్ట్‌బ్యాంక్‌లో చాలా సంవత్సరాలుగా సాయుధ వాహనాలు, ఆర్మీ బుల్డోజర్లు, డ్రోన్లను మోహరించిన ఇజ్రాయిల్ చేపట్టిన అతి పెద్ద దాడిలో భాగంగా జరిపిన కాల్పులు, బాంబు దాడులు, పేలుళ్లతో జెనిన్ శరణార్థి శిబిరంలోని శరణార్థులు భయభ్రాంతులకు గురయ్యారు.

శిబిరాన్ని వదిలి పారిపోయిన 3 వేల మంది శరణార్థులను సమీప పాఠశాలల్లో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జెనిన్ డిప్యూటీ గవర్నర్ కమల్ అబు అల్ రౌబ్ తెలిపారు. ఈ దాడుల్లో 8 మంది మరణించారు. 80 మంది గాయపడ్డారు. అందులో 17 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వారం రోజుల క్రితం ఇజ్రాయిల్ చేపట్టిన హెలికాప్టర్ క్షిపణి దాడిలో ఏడుగురు పాలస్తీనియన్లు మృతి చెందారు.

తీవ్రవాద నిలయంగా జెనిన్ శిబిరం: ఇజ్రాయిల్

18 వేల మంది శరణార్థులు నివసిస్తున్న జెనిన్ శిబిరం తీవ్రవాద నిలయంగా మారిపోయిందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. ఈ శిబిరానికి చెందిన పాలస్తీనా తీవ్రవాదులు సమీపంలోని సైనికులపై తరచూ రాళ్లు, గ్రనేడ్లు విసురుతున్నారని, పేలుళ్లకు పాల్పడుతున్నారని, బారికేడ్లను అగ్నికి ఆహుతి చేస్తున్నారని ఇజ్రాయిల్ సైనికులు చెబుతున్నారు. జెనిన్ బ్రిగేడ్ అని పిలిచే ఒక సమూహానికి చెందిన ఉమ్మడి కార్యకలాపాలకు, ఆయుధాల డిపోకు నిలయంగా మారిన ఒక రహస్య స్థావరంపై దాడి చేసినట్లు తెలిపారు.

ఉగ్రవాదుల శిబిరంలో దాచిన ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని తమ సైనిక దళాలు ధ్వంసం చేస్తున్నాయని ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. తాము దాడులను మరింత తీవ్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయిల్ సైనికాధికారి డేనియల్ హగారి తెలిపారు. జెనిన్ క్యాంప్‌లోని మసీదు వద్ద సైనికులకు, ముష్కరులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని, ఆ తర్వాత భవనంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభించాయని సైన్యం తెలిపింది. జెనిన్ ప్రాంతంపై పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ నియంత్రణ నామమాత్రంగా ఉంది.

జెనిన్ ప్రజలకు వ్యతిరేకంగా బహిరంగ యుద్ధం: పాలస్తీనా

ఈ దాడిని జెనిన్ ప్రజలకు వ్యతిరేకంగా బహిరంగ యుద్ధంగా పాలస్తీనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇజ్రాయిల్ సైనికులు శిబిరంలోకి బుల్డోజర్లను తీసుకెళ్లడం తాను చూశానని, వాళ్లు అక్కడి ప్రజల ఇళ్లను ధ్వంసం చేస్తున్నారని జెనిన్ నివాసి బదర్ షా గౌల్ చెప్పారు. ఆస్పత్రి మార్చురీ వద్ద కొన్ని మృతదేహాలు దుప్పట్లతో కప్పి ఉన్నాయి. ఉత్తర వెస్ట్‌బ్యాంక్‌లో కార్యకలాపాలను ఇజ్రాయిల్ ఇప్పటికే వేగవంతం చేసింది. పాలస్తీనియన్లను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహిస్తోంది. ఈ హింసాకాండపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మానవతా చట్టాలను గౌరవించాలని పిలుపునిచ్చారు.

అయితే.. తీవ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా తమ ప్రజలను రక్షించుకునే హక్కు ఇజ్రాయిల్‌కు ఉందని అమెరికా తెలిపింది. అంతర్జాతీయ మానవతా చట్టం యొక్క స్పష్టమైన ఉల్లంఘనగా జోర్డాన్ అభివర్ణించింది. పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కోరింది. జెనిన్‌పై ఇజ్రాయిల్ దాడిపై చర్చించేందుకు అరబ్ లీగ్ అత్యవసర సమావేశం నిర్వహించింది. వెస్ట్‌బ్యాంక్‌ను ఇజ్రాయిల్ 1967లో ఆరు రోజుల యుద్ధం తర్వాత ఆక్రమించుకుంది.


Similar News