'నిక్కీ హేలీతో వాడీవేడి చర్చ'.. తొలి డిబేట్‌లోనే దుమ్ములేపిన వివేక్

రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్ధిత్వ రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి అందరితో వహ్వా అనిపించుకుంటున్నారు.

Update: 2023-08-24 16:28 GMT

వాషింగ్టన్‌ : రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్ధిత్వ రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి అందరితో వహ్వా అనిపించుకుంటున్నారు. ఈ పోటీలో ఉన్న భారత సంతతి మహిళ నిక్కీ హేలీతో ‘ఫాక్స్ న్యూస్’ వేదికగా జరిగిన తొలి బహిరంగ చర్చలో వివేక్‌ తన వాక్చాతుర్యంతో అందరి మన్ననలు అందుకున్నారు. బరాక్ ఒబామా రాసిన ఒక పుస్తకంలోని పదాలతో వివేక్ రామస్వామి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఉక్రెయిన్ యుద్ధ అవసరాలకు అమెరికా ప్రభుత్వం నిధులు ఇవ్వడాన్ని వ్యతిరేకించిన వివేక్‌.. ముందు అమెరికా తన ఇంటిని సరిదిద్దుకోవాలని సూచించారు. అమెరికాకే సమస్యలు ఉన్నప్పుడు మరొక దేశంలో యుద్ధానికి మద్దతు ఇవ్వడం సరికాదన్నారు.

రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్ధిత్వ రేసులో మొదటి రెండు స్థానాల్లో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్‌లు ఈ డిబేట్‌కు హాజరుకాలేదు. ఈనేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కొంటున్న కేసుల గురించి వివేక్ ప్రస్తావించారు. ట్రంప్ 90కిపైగా కేసులను ఎదుర్కొంటున్నా మెజారిటీ ప్రజలు ఆయన వైపే ఉన్నామని సర్వేల్లో చెబుతుండటం బాధాకరమన్నారు. తాను అమెరికా ప్రెసిడెంట్ అయితే దేశంలోని ఉపాధ్యాయ సంఘాలను క్లోజ్ చేస్తానని.. యువ ఓటర్లకు ఎగ్జామ్స్ నిర్వహిస్తానని వివేక్ చెప్పారు. ఉక్రెయిన్ పట్ల అమెరికా అనుసరిస్తున్న విధానంపై రామస్వామికి సరైన అవగాహన లేదని నిక్కీ హేలీ ఆరోపించారు.

ఇలాంటి అభ్యర్థులు అమెరికా భద్రతకు ముప్పు అని దుయ్యబట్టారు. అమెరికా శత్రువులకు వివేక్ మద్దతు పలుకుతున్నారని ఆమె మండిపడ్డారు. ఉక్రెయిన్‌ను రష్యాకు అప్పగించాలని వివేక్ చెబుతున్నట్టుగా అనిపిస్తోందన్నారు. నిక్కీ హేలి మాట్లాడుతుండగా.. తరుచూ కలుగజేసుకున్న రామస్వామి.. చెప్పేదంతా అబద్ధం అని అన్నారు. నిక్కీ హేలికి విదేశీ విధానాలపై సరైన అవగాహన లేదని అన్నారు.

అమెరికా విదేశాలకు కేటాయిస్తున్న మిలిటరీ ఫోర్స్‌ను ఏమాత్రం వినియోగించినా.. దక్షిణ ప్రాంతం నుంచి ఎదురైతున్న తిరుగుబాటును అంతం చేయొచ్చన్నారు. ఈ క్రమంలో అరుస్తూ ఒకరికొకరు వేళ్లు చూపించుకునే స్థాయికి డిబేట్ చేరింది. ‘కేవలం 1, 2 పాయింట్లు సాధించిన వివేక్, హేలీలతో నేను డిబేట్‌లో పాల్గొనలేను. ఇప్పటికే 55 నుంచి 60 పాయింట్లతో నేను లీడ్‌లో ఉన్నాను. మొదటి స్థానంలో ట్రంప్‌తో చర్చకు రెడీ.. ట్రంప్ రాలేదు కాబట్టి నేను డిబేట్ కు వెళ్లలేదు’ అని ఒక ఇంటర్వ్యూలో రాన్ డిసాంటిస్ చెప్పాడు. కాగా, రిపబ్లికన్ పార్టీ తన సెకండ్ రౌండ్ డిబేట్‌ను సెప్టెంబర్ 27న కాలిఫోర్నియాలోని సిమి వ్యాలీలో నిర్వహించనుంది.


Similar News