US President Elections: ప్రజాస్వామ్యం కోసం బుల్లెట్ గాయాన్ని ఎదుర్కొన్నా- ట్రంప్

తనపై వస్తున్న విమర్శలకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కౌంటర్ ఇచ్చారు. తాను ప్రజాస్వామ్యానికి ముప్పంటూ ప్రత్యర్థి డెమొక్రాటిక్‌ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు.

Update: 2024-07-21 07:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తనపై వస్తున్న విమర్శలకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కౌంటర్ ఇచ్చారు. తాను ప్రజాస్వామ్యానికి ముప్పంటూ ప్రత్యర్థి డెమొక్రాటిక్‌ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యం(Democracy) కోసం బుల్లెట్ ని ఎదుర్కొన్నానని అన్నారు. తాను ఏం హాని చేశానని ప్రశ్నించారు. ఇటీవల తనపై జరిగిన హత్యాయత్నం తర్వాత శనివారం ఆయన తొలిసారిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. రిపబ్లికన్‌ పార్టీ గెలిస్తే ప్రాజెక్టు 2025 పేరిట ట్రంప్‌ భారీ శ్రీకారం చుట్టనున్నారని డెమొక్రాట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే, ఇది ప్రజాస్వామ్య మనగడకే పెద్ద ప్రమాదమని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ..తానేమీ తీవ్రవాదిని కానన్నారు. డెమొక్రాట్లు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

బైడెన్ పై విమర్శలు

మరోవైపు అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరిగిన ప్రైమరీ ఎన్నికల ఫలితాలను సైతం డెమొక్రాటిక్‌ పార్టీ(Democratic Party,) పక్కన పెట్టాలనుకుంటుందని ట్రంప్‌ ఆరోపించారు. తద్వారా అధికారంలో ఉన్న జో బైడెన్‌ను(Joe Biden) కాదని మరొకరిని అభ్యర్థిగా నిలిపేందుకు యత్నిస్తున్నారన్నారు. "తమ అభ్యర్థి ఎవరో వారికి తెలియదు. కానీ ఇతను ఓట్లు అడుగుతున్నాడు. ఇప్పుడు వారు దానిని తీసివేయాలనుకుంటున్నారు. అదే ప్రజాస్వామ్యం" అని డెమొక్రాటిక్ పార్టీని ఎద్దేవా చేశారు. దాదాపు రెండుగంటల పాటు ప్రసంగించిన ట్రంప్‌ (Trump).. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో తనపై జరిగిన కాల్పుల ఘటన, తదనంతర పరిణామాలను గుర్తుచేసుకున్నారు.

జిన్ పింగ్ ను ప్రశంసించిన ట్రంప్

చైనా అధినేత జిన్ పింగ్(Xi Jinping) ను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. "1.4 బిలియన్ల ప్రజలను ఉక్కు పిడికిలితో" నియంత్రించారని ఆయన ప్రశంసించారు. మిషిగన్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో ట్రంప్‌ తన ఉపాధ్యక్ష అభ్యర్థి జె.డి.వాన్స్‌తో కలిసి పాల్గొన్నారు. జేడీ వాన్స్ కమలా హారిస్ ని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. “నేను యూఎస్ మెరైన్ లో పనిచేశారు. వ్యాపారాన్ని నిర్మించారు. చెక్ కలెక్ట్ చేయడం తప్ప మీరు ఏం చేశారు?” అని ప్రస్నించారు. ఇకపోతే, అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే కీలక రాష్ట్రాల్లో మిషిగన్‌ ఒకటి కావడం గమనార్హం.


Similar News