'బైపార్జోయ్' తుఫాను.. పాకిస్థాన్‌లో భారీ వర్షాలు..

"బైపార్జోయ్" తుఫాను కరాచీ తీరం దిశగా కదులుతున్న ప్రస్తుత తరుణంలో వాయవ్య పాకిస్థాన్‌ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

Update: 2023-06-11 14:01 GMT

పెషావర్/న్యూఢిల్లీ : "బైపార్జోయ్" తుఫాను కరాచీ తీరం దిశగా కదులుతున్న ప్రస్తుత తరుణంలో వాయవ్య పాకిస్థాన్‌ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆ ప్రాంతంలో వరదల ఉధృతి, పిడుగుపాటు సహా పలు ఘటనల్లో 34 మంది మృతిచెందగా,145 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఖైబర్ పఖ్తున్‌ ఖ్వా ప్రావిన్స్‌లోని బన్నూ, లక్కీ మార్వాట్, కరక్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలకు చాలాచోట్ల ఇళ్ళు, చెట్లు నేలకూలాయి. ఎలక్ట్రికల్ ట్రాన్స్‌మిటర్ టవర్‌ లు కూలిపోయాయి. పునరావాసం, సహాయక చర్యల కోసం స్థానిక ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసింది. ప్రాణ నష్టంపై పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను కోరారు.

అత్యంత తీవ్రమైన తుఫానుగా బైపార్జోయ్..

"బైపార్జోయ్" తుఫాను ఆదివారం ఉదయం "అత్యంత తీవ్రమైన తుఫాను"గా మారింది. ఇది జూన్ 15న మధ్యాహ్నం గుజరాత్‌లోని కచ్ జిల్లా, పాకిస్తాన్‌లోని కరాచీ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. సౌరాష్ట్ర, కచ్ తీరాలకు తుఫాను హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను ప్రభావంతో గంటకు 135 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈ తుఫాను గుజరాత్ తీరంలో ల్యాండ్‌ఫాల్ అవుతుందా..? కాదా..? అనే దానిపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డీఎస్ పాయ్ తెలిపారు. జూన్ 6న ఈ తుఫాను మొదలైనప్పటి నుంచి దాని తీవ్రతలో గణనీయమైన అనిశ్చితి నెలకొందన్నారు.


Similar News