కాల్పుల విరమణకు ఒకే అన్న హమాస్.. ఇజ్రాయెల్ సంగతేంటీ..?

గత కొంత కాలంగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

Update: 2024-06-11 09:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గత కొంత కాలంగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణకు ఐక్యరాజ్యసమితి, అమెరికా తదితర దేశాలు మధ్యవర్తిత్వం వహించి పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు కృ‌షి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హమాస్ కాల్పుల విరమణకు ఆమోదించింది. అంతకుముందు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కాల్పుల విరమణ తీర్మానాన్ని ప్రతిపాదించగా ఓటింగ్‌లో సభ్య దేశాలు అనుకూలంగా ఓటు వేసి ఆమోదించారు. దీనిని గాజాకు చెందిన హమాస్ గ్రూప్ నాయకులు సైతం ఆమోదించారు. అలాగే తదుపరి శాంతి చర్చలకు కూడా సిద్ధంగా ఉన్నట్లు వారు తెలిపారు.

ఇదే సమయంలో ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణకు కట్టుబడి ఉండేలా చూడాల్సిన బాధ్యత అమెరికా, UN పై ఉందని హమాస్ సీనియర్ అధికారి సమీ అబు జుహ్రీ మంగళవారం అన్నారు. కాల్పుల విరమణతో పాటు, మా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ, ఇజ్రాయెల్ అధీనంలో ఉన్న ఖైదీల కోసం బందీల మార్పిడికి సంబంధించి భద్రతా మండలి తీర్మానాన్ని హమాస్ అంగీకరిస్తున్నట్లు ఆయన చెప్పారు.

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మంగవారం మాట్లాడుతూ, కాల్పుల విరమణ ప్రతిపాదనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హామీ ఇచ్చారని వెల్లడించారు. గత రాత్రి ప్రధాన మంత్రి నెతన్యాహుతో సమావేశమయ్యాను, ఆయన నా ప్రతిపాదనకు సానుకూలంగా ఉన్నారు. అమెరికా రూపొందించిన కాల్పుల విరమణ తీర్మానంపై UN ఓటును హమాస్ స్వాగతించడం యుద్ధాన్ని ముగించడానికి "ఆశాజనక" సంకేతం అని అన్నారు.

ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధాన్ని ముగించే కాల్పుల విరమణ ప్రతిపాదనను అమెరికా రూపొందించగా దానిని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆమోదించారు. సోమవారం జరిగిన ఓటింగ్‌లో తీర్మానం 14-0 ఓట్లను పొందగా, రష్యా ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.


Similar News