బాణసంచా కాల్చడంతో అడవిలో చెలరేగిన మంటలు.. 13 మంది అరెస్ట్

సరదా కోసం కాల్చిన బాణసంచా కారణంగా అడవిలో భారీ ఎత్తున మంటలు చెలరేగి వేలాది చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి

Update: 2024-06-23 04:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సరదా కోసం కాల్చిన బాణసంచా కారణంగా అడవిలో భారీ ఎత్తున మంటలు చెలరేగి వేలాది చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ఘటన గ్రీకు ద్వీపం హైడ్రాలో జరిగింది. ఏథెన్స్‌కు దక్షిణంగా ఉన్న ప్రఖ్యాత పర్యాటక ద్వీపంలో ఒక పడవ నుంచి బాణసంచా కాల్చి విసరడం వల్ల దాని నిప్పురవ్వలు దగ్గరలోని పైన్ అడవిలో పడి మంటలు చెలరేగాయి. చిన్నగా మొదలైన మంటలు కాస్త కాసేపటి విస్తృతంగా వ్యాపించాయి. దీంతో అడవిలో వేలాది చెట్లు మంటల్లో కాలిపోయాయి.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఆ అడవికి రోడ్డు మార్గం లేకపోవడంతో సముద్ర మార్గంలో చేరుకుని తమ వద్ద ఉన్న పరికరాలతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. హెలికాప్టర్లను సైతం రంగంలోకి దింపి నీళ్లను మంటలపై చల్లారు. ఆ తర్వాత మెల్లగా మంటలు తగ్గుముఖం పట్టాయి.

ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, అధికారులు 13 మంది గ్రీకు పౌరులని బాధ్యులుగా అరెస్ట్ చేశారు. వారిని ఆదివారం ప్రాసిక్యూటర్ల ముందు హాజరు పరిచారు. ఈ అగ్నిప్రమాదం గ్రీస్‌లో ఆగ్రహాన్ని ప్రేరేపించింది. ఇప్పటికే అక్కడి ప్రాంతాల్లో అనేక అడవులు మంటలకు బలవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నిర్లక్ష్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

హైడ్రా మేయర్, గియోర్గోస్ కౌకౌడాకిస్ గ్రీక్ బ్రాడ్‌కాస్టర్ మాట్లాడుతూ, కొందరు బాధ్యతా రహితంగా పైన్ అడవిలోకి బాణసంచా విసరడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతల కారణంగా అడవుల్లో మంటల్లో అంటుకుని తీవ్ర నష్టం కలుగుతుంది. ఇప్పుడు కొంతమంది చేసే తప్పులకు మరింత కాలిపోతున్నాయని అన్నారు.


Similar News