Dev Raturi: చైనా స్కూల్‌ పుస్తకాల్లో భారతీయుడి లెస్సన్..

చైనాలోని స్కూల్‌ పుస్తకాల్లో ఓ భారతీయుడి కథ లెస్సన్‌గా చేరింది.

Update: 2023-07-26 10:49 GMT

బీజింగ్ : చైనాలోని స్కూల్‌ పుస్తకాల్లో ఓ భారతీయుడి కథ లెస్సన్‌గా చేరింది. ఆయనే దేవ్‌ రాటూరి. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గఢ్వాల్‌ జిల్లా కెమ్రియా సౌర్‌  గ్రామంలో పుట్టిన దేవ్‌ రాటూరి.. ఇప్పుడు  చైనా సినీరంగంలో పాపులర్‌ స్టార్‌. ఇప్పటివరకు 35 చైనీస్‌ సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు. వెయిటర్‌ నుంచి పాపులర్‌ స్టార్‌ దాకా ఆయన సక్సెస్‌ జర్నీని విద్యార్థులకు చెప్పి వారిలో స్ఫూర్తిని నింపేందుకు ఈ లెస్సన్‌ను బుక్స్‌లో చేర్చారు. 2005లో చైనాలోని ఓ భారత రెస్టారెంట్‌లో వెయిటర్‌గా దేవ్‌ రాటూరి చేరారు. 2013లో మరో పెద్ద హోటల్‌లో ఆయనకు  మేనేజర్‌ జాబ్ వచ్చింది. 

కొన్నాళ్లకు చైనాలోని షియాన్‌ సిటీలో ‘రెడ్‌ ఫోర్ట్‌’ పేరుతో సొంతంగా రెస్టారెంట్‌ను ప్రారంభించారు. 2017లో దేవ్‌ రాటూరి రెస్టారెంట్ కు వచ్చిన చైనా డైరెక్టర్‌ ఒకరు.. సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చారు. దీంతో  ‘స్వాట్‌’ అనే టీవీ సిరీస్‌లో చిన్న పాత్రలో దేవ్‌ రాటూరి నటించారు. అది హిట్ కావడంతో ఆయన జీవితం ఒక్కసారిగా మారిపోయింది. సినిమాల్లో వచ్చిన పాపులారిటీ ఆయన వ్యాపారానికి కూడా కలిసొచ్చింది. ఇప్పుడు దేవ్‌‌కు చైనాలో ఎనిమిది రెస్టారెంట్లు ఉన్నాయి. పొరుగు దేశంలో స్థిరపడినా మాతృభూమిపై ప్రేమను దేవ్‌ రాటూరి మర్చిపోలేదు. అందుకే తన గ్రామం నుంచి 150 మందిని తీసుకెళ్లి ఉద్యోగాలిచ్చారు.


Similar News