Taliban Chief Order: ప్రార్థనలు చేస్తారా? శిక్ష ఎదుర్కొంటారా?

అఫ్గానిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వం మరో కొత్త ఆదేశాలతో వార్తల్లో నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా రోజుకు ఐదుసార్లు మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేయాలని తాలిబన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Update: 2024-08-09 04:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అఫ్గానిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వం మరో కొత్త ఆదేశాలతో వార్తల్లో నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా రోజుకు ఐదుసార్లు మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేయాలని తాలిబన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ మసీదుకు వెళ్లకుంటే శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని తాలిబన్ సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా వెల్లడించారు. "తాలిబాన్ ప్రభుత్వం, మంత్రిత్వ శాఖలు, అధికారులు ఐదుసార్లు ప్రార్థనలు చేసేలా షరియాకు కట్టుబడి ఉన్నారు అని అఖుంద్జాదా సంతకం చేసిన ఉత్తర్వు పేర్కొంది. సరైన కారణంలేకుండా ప్రార్థనలు చేయకపోతే ఉద్యోగులను హెచ్చరించాలని.. ఇదే పునరావృతం చేస్తే సంబంధిత అధికారి ఆ ఉద్యోగిని శిక్షించాల్సిందిగా అందులో ఉంది. అయితే, ఎలాంటి శిక్ష విధిస్తారనే దానిపైన తాలిబన్ ప్రతినిధి స్పందించలేదు. మరోవైపు, ఇస్లాం ప్రకారం ముస్లింలు రోజుకు ఐదుసార్లు మసీదులో నమాజ్ చేయాలి. కాగా, సెలవు దినాల్లో ప్రార్థనలకు హాజరు కావాలనే ఆదేశాన్ని ఎలా అమలు చేస్తారో తెలియాల్సి ఉంది.

తాలిబన్ల అరాచక పాలన

2021లో అఫ్గాన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడింది. అఖుంద్జాదా ప్రభుత్వం సమాజంపై విస్తృత ఆంక్షలు విధిస్తోంది. మహిళలు ఉద్యోగాలకు వెళ్లకుండా ఆంక్షలు విధించింది.బాలికలను చదువుకు దూరం చేసింది. తాలిబన్ల రహస్య స్థావరమైన దక్షిణ కాందహార్ నుంచి అఖుంద్జాదా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఆయన చాలా అరుదుగా బహిరంగంగా కనిపిస్తారు. తాలిబన్లకు నాయకత్వం వహించిన వ్యక్తి ఫోటోగ్రాఫ్‌లు లేదా వీడియో తీయకుండా నిషేధాన్ని విధించారు. తాలిబన్ల అరాచకాలపై ఐక్యరాజ్యసమితి గత నెలలో ఓ నివేదికను విడుదల చేసింది. "ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో వ్యక్తుల కార్యకలాపాలను నియంత్రించడానికి నిర్బంధ చర్యలు చేపడుతోందని ఆరోపించింది. దీనివల్ల జనాల్లో భయం పెరిగుతుందని.. తాలిబన్లు బెదిరింపులను పాల్పడుతున్నారని తెలిపింది.


Similar News