భారతీయ విద్యార్థులపై దాడులు: అమెరికా స్పందన ఇదే
అమెరికాలో ఇటీవల నలుగురు భారతీయ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. అంతేగాక పలువురు భారత సంతతి వ్యక్తులపై దాడులు సైతం జరుగుతున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో ఇటీవల నలుగురు భారతీయ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. అంతేగాక పలువురు భారత సంతతి వ్యక్తులపై దాడులు సైతం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే యూఎస్ స్పందించింది. భారత విద్యార్థులపై దాడులను ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, పరిపాలనా విభాగం శాయశక్తులా ప్రయత్నిస్తోందని వైట్ హౌస్‌లోని జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు. జాతి, లింగం, మతపరమైన హింసకు అమెరికాలో తావు లేదని తెలిపారు. ఇటువంటి ఘటనలు ఆమోదయోగ్యం కాదని వెల్లడించారు. ఇటీవల జరిగిన దాడులపై దర్యాప్తు చేపట్టామని స్పష్టం చేశారు. ‘స్థానిక అధికారులతో కలిసి మేము చేయగలిగినదంతా చేస్తున్నాం. వీటికి గల కారణాలను తెలుసుకునేందుకు అధ్యక్షుడు, పరిపాలన చాలా కష్టపడి పని చేస్తోంది. ఎటువంటి ఆందోళన అవసరం లేదు. త్వరలోనే అందరికీ స్పష్టంగా తెలియజేయడానికి ప్రయత్నిస్తాం’ అని తెలిపారు. మరోవైపు వేర్వేరు ఘటనల్లో విద్యార్థులు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ నాయకుడు అజయ్ జైన్ భూటోరియా తెలిపారు. యూఎస్‌లో విద్యను అభ్యసిస్తున్న వారికి మెరుగైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘ఇటీవలి ఘటనలు భారతదేశంలోని తల్లిదండ్రులు, బాధితుల కుటుంబాలను ఆందోళనకు గురిచేశాయి. యూఎస్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థుల రక్షణకు తక్షణ చర్యలు అవసరం’ అని తెలిపారు.
విద్యార్థుల మరణాలపై ఆందోళన
గత నెల రోజుల్లో నలుగురు భారతీయ విద్యార్థులు, ముగ్గురు భారత సంతతికి చెందిన వారు మరణించారు. మరో భారతీయ విద్యార్థిపై కూడా దాడి జరిగింది. తాజాగా కాలిఫోర్నియాలోని తమ అపార్ట్‌మెంట్‌లో భారతీయ సంతతికి చెందిన ఒక కుటుంబం శవమై కనిపించింది. జనవరిలో వివేక్ సైనీ అనే విద్యార్థి జనవరిలో మరణించగా.. ఆ తర్వాత వెంట వెంటనే ముగ్గురు స్టూడెంట్స్ మరణించడం, మరొక విద్యార్థిని తీవ్రంగా కొట్టిన ఘటన వెలుగు చూడటంతో ఆందోళన సంతరించుకుంది. గతంలో ఈ ఘటనలపై భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి స్పందించారు. యూఎస్‌లో భారత విద్యార్థులకు రక్షణ ఉంటుందని, చదువుకోవడానికి మంచి ప్రదేశమని తెలిపారు. ఈ క్రమంలోనే మరోసారి వైట్ హౌస్ స్పందిచడం గమనార్హం.