Elon musk: ట్రంప్ కార్యవర్గంలో ఆ ఇద్దరికి చోటు..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald trump) ఘన విజయం సాధించారు. త్వరలోనే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald trump) ఘన విజయం సాధించారు. త్వరలోనే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. కాగా.. ఆయన గెలుపుతో కీలక పాత్ర పోషించిన ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon musk), వివేక్ రామస్వామి (Vivek Ramaswamy)లకు ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు అప్పగించారు. ‘ఈ గొప్ప ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రక్షాళన, మితిమీరిన నింబధనలు, పన్నుల కోత, అనవసర ఖర్చు తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. ‘సేవ్ అమెరికా-2 ఉద్యమానికి ఇవి చాలా ముఖ్యమైనవి. వీరిద్దరూ నా పాలనకు మార్గం సుగమం చేస్తారు’ అని ట్రంప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ గా..
మరోవైపు, నేషనల్ ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్‌ను సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికన్ల రాజ్యాంగ హక్కుల కోసం రాట్ క్లిఫ్ పోరాడుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అర్కాస్నాస్ మాజీ గవర్నర్ మైక్ హుక్‌అబీని ఇజ్రాయెల్ రాయబారిగా ఎంపిక చేశారు. రక్షణశాఖ కార్యదర్శి బాధ్యతలను ఫ్యాక్స్ న్యూస్‌లో హోస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న పీట్ హెగ్సెత్‌కు అప్పగించారు. ఇకపోతే, ఇప్పటికే వైట్ హౌస్ చీఫ్ స్టాఫ్ గా సూసీ వైల్స్ ని పేరుని ప్రకటించారు.