చైనాలో భారీ వరదలు.. 47కి చేరిన మృతుల సంఖ్య

చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని మీజౌ నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 47 మంది మృతి చెందినట్లు అక్కడి మీడియా పేర్కొంది.

Update: 2024-06-22 03:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని మీజౌ నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 47 మంది మృతి చెందినట్లు అక్కడి మీడియా పేర్కొంది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, వరదలు, బురద వల్ల పింగ్యువాన్ కౌంటీలోని ఎనిమిది టౌన్‌షిప్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అలాగే మెయిజౌ నగరంలో మరో 38 మంది మరణించినట్లు సమాచారం. అంతకుముందు, మెక్సియన్ జిల్లాలో నలుగురు, జియావోలింగ్ కౌంటీలో ఐదుగురు మరణించినట్లు స్థానిక రాష్ట్ర ప్రసార మీడియా తెలిపింది.

ఆదివారం నుంచి మొదలైన వర్షాలు నిరంతరాయంగా కురుస్తుండటంతో అక్కడి నదులు అన్ని కూడా పొంగిపోర్లుతున్నాయి. మెయిజౌ గుండా ప్రవహించే సాంగ్యువాన్ నదికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. భారీ వర్షాలకు మెక్సియన్ జిల్లాకు వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతింది. చెట్లు నేలకూలాయి, ఇళ్లు కూలిపోయాయి. ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాల నుంచి వచ్చే వరద ఇళ్లలోకి చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండచరియలు విరిగి పడుతుండటంతో మరణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. కొండ ప్రాంతాల సమీప ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు.

అధికారులు స్థానికులను రక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా జియావోలింగ్ కౌంటీలో ప్రత్యక్షంగా $502 మిలియన్లు, మెక్సియన్ జిల్లాలో $146 మిలియన్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. రాబోయే 24 గంటల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో బలమైన ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మధ్య చైనాలోని హెనాన్, అన్‌హుయి ప్రావిన్స్‌లు, అలాగే కోస్తాలోని జియాంగ్సు ప్రావిన్స్, దక్షిణ ప్రావిన్స్ గుయిజౌ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


Similar News