2022 నుంచి జైల్లో ఉన్న మహిళ.. ప్రస్తుతం 4 నెలల గర్భవతి
హత్య చేసిందనే ఆరోపణపై అమెరికాకు చెందిన డేసీ లింక్ అనే 28 ఏళ్ల యువతిని అరెస్టు చేసి జైల్లో ఉంచారు.
దిశ, ఫీచర్స్: హత్య చేసిందనే ఆరోపణపై అమెరికాకు చెందిన డేసీ లింక్ అనే 28 ఏళ్ల యువతిని అరెస్టు చేసి జైల్లో ఉంచారు. 2022 నుంచి ఈమె టర్నర్ గులీఫోర్డ్ నైట్ కరెక్షనల్ సెంటర్ జైలులోనే కస్టడీలో ఉంటుంది. వివరాల్లోకెళ్తే.. డేసీ తన భర్త ప్రవర్తన మితిమీరడంతో ప్రాణ రక్షణ కోసం మాత్రమే హత్య చేసిందని డేసీ తరఫు న్యాయవాది కోర్టులో చెప్పారు. తుపాకీతో సింగిల్ షాట్ బుల్లెట్‌తో డేసీ తన భర్తను హత్య చేసినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. అయితే రీసెంట్గా క్రిస్మస్ పండగ సందర్భంగా జైలులో ఉన్న డేసీ తన ఫ్యామిలీతో జైలు నుంచి ఫోన్ మాట్లాడింది. ప్రస్తుతం తాను 4 నెలల ప్రెగ్నెన్సీ అని కుటుంబీకులతో చెప్పింది. దీంతో వారికి మాటలు రాలేదు. ఫస్ట్ డేసీ మాటలను వారు నమ్మలేదు. ఆ మాటలు నిజమని నమ్మడంతో జైలు భద్రతపై వారి ఫ్యామిలీకి భయం వేసిందంటూ డేసీ సోదరి క్రిస్టల్ బారెటో తాజాగా మీడియాకు తెలిపారు.
అలాగే డేసీ తరపున న్యాయవాది.. తమ క్లయింట్ గర్భంతో ఉన్నందున.. ఆమె భద్రత పై అనుమానాలు ఉన్నందున డేసీ హౌస్ అరెస్ట్ కు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరుతున్నారు. ఆ గర్భం ఎవరి వల్ల వచ్చింది? అత్యాచారం ఏమైనా జరిగిందా? అనే అంశాలను డేసీ తమకు చెప్పడానికి ఇష్టపడలేదని డేసీ సోదరి చెప్పుకొచ్చింది. డేసీ జైల్లో నుంచి అప్పుడప్పుడు మాకు ఫోన్ చేస్తుంది. ఇప్పుడు కాల్ చేసినప్పుడు ఇలా చెప్పడంతో మాకు చాలా భయంగా ఉంది. పూర్తి వివరాలను తను చెప్పలేదు. ఎందుకంటే జైలులో ఫోన్లు అన్ని రికార్డవుతాయి. జైల్లో మహిళలకు, పురుషులకు వేర్వేరు బరాక్‌లు ఉన్నప్పటికీ ఇలా ఎందుకు జరిగిందని సోదరి క్రిస్టల్ ఆరోపించింది. మరోవైపు ఈ ఘటనపై జైలు అధికారులు డేసీకి వైద్య పరీక్షలు చేయించారు. నిజంగానే తను ప్రెగ్నెంట్ అని వెల్లడైంది. కానీ జైల్లో ఎటువంటి అత్యాచారం జరగలేదని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది.