పాకిస్థాన్‌లో ఖురాన్‌ను తగులబెట్టాడని ఒక వ్యక్తి హత్య
పవిత్రమైన ఖురాన్‌లోని కొన్ని పేజీలను తగులబెట్టాడనే కోపంతో కొంతమంది ఆకాతీయులు ఒక వ్యక్తిని హత్య చేశారు
దిశ, నేషనల్ బ్యూరో: పవిత్రమైన ఖురాన్‌లోని కొన్ని పేజీలను తగులబెట్టాడనే కోపంతో కొంతమంది ఆకాతీయులు ఒక వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘటన వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాలో స్వాత్ జిల్లాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఆ తర్వాత చెలరేగిన ఘర్షణలో ఎనిమిది మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు పేర్కొన్న దాని ప్రకారం, సియాల్‌కోట్ జిల్లాకు చెందిన వ్యక్తి స్వాత్‌లోని మద్యన్ తహసీల్‌లో పవిత్ర ఖురాన్‌లోని కొన్ని పేజీలను తగులబెట్టాడని గొడవ జరగడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని మద్యన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఆ తర్వాత కాసేపటికి పోలీస్ స్టేషన్ బయట గుమికూడిన గుంపు అతడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేసింది. అందుకు పోలీసులు నిరాకరించడంతో వారు కాల్పులు జరపడం ప్రారంభించగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడగా అతన్ని మద్యన్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత గుంపు పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టారు, అనంతరం కొందరు వ్యక్తులు పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి నిందితుడిని కాల్చి చంపి మృతదేహాన్ని మద్యన్ అడ్డాకు ఈడ్చుకెళ్లారని జిల్లా పోలీసు అధికారి జహీదుల్లా తెలిపారు.
ఈ ఘటనతో అక్కడి ప్రాంతంలో తీవ్ర అలజడి నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మద్యన్‌లో భారీగా పోలీసులను మోహరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెపికె అలీ అమీన్ గండాపూర్ ఈ ఘటనపై దృష్టి సారించారు, ప్రాంతీయ పోలీస్ అధికారి నుంచి నివేదిక కోరారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలని, ప్రజలు ప్రశాంతంగా, శాంతియుతంగా ఉండాలని సీఎం ఐజీపీని ఆదేశించారు.